Jubilee Hills Bypoll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఏఐసీసీ జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ విశ్వనాథన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి బూత్ స్థాయిలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పొన్నం సూచించారు.
‘గత 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశారు’
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘ప్రతీ బూత్ లో ఉన్న ఓటర్లను కలిసి చెప్పండి. 10 ఏళ్ల పాలనలో ఎవరూ రేషన్ కార్డు, సన్న బియ్యం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎవరికీ డబల్ బెడ్ రూమ్ ఇచ్చారో ప్రజలను అడగండి. ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చారో ప్రశ్నించండి. అయన పాలనలో అందరిమీద కేసులు పెట్టి వేధించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత అంటే నాకు సానుభూతి ఉంది. కానీ అందరి ముందు మైక్ పట్టుకొని ఏడిస్తే విడ్డురంగా ఉంది. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా చెబుతున్నా.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కు మీరంతా సపోర్ట్ చేయాలి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రతి ఇంటింటికీ వెళ్లాలి. నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేయాలి’ అని కార్యకర్తలకు మంత్రి పొన్నం దిశానిర్దేశం చేశారు.
‘ఓటు చోరీ పేరుతో డ్రామాలు’
కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అని మంత్రి పొన్నం అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో తామెక్కడ జోక్యం చేసుకోలేదని అన్నారు. ‘ఓటు చోరీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. ఎవరు ఎదురుతిరిగినా అణిచివేసే మనస్తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీనే దొంగ ఓట్లకు పాల్పడింది’ అని పొన్నం విమర్శించారు. ఓట్లకు సంబంధించి ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే బాధ్యత వహించాలని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ: మంత్రి పొన్నం
ఓటు చోరీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా
ఎవరు ఎదురుతిరిగినా అణిచివేసే మనస్తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీనే దొంగ ఓట్లకు పాల్పడింది
– మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/0F5v8DVCoh
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025
బీఆర్ఎస్ ఖాళీ: మంత్రి వివేక్
మరోవైపు మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి.. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఒక అభిప్రాయానికి వచ్చారని అన్నారు. గతంలో సారు కారు 16 అన్నారని.. తర్వాత ఏమైందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇక జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ గెలిస్తే.. ఇక బీఆర్ఎస్ కనిపించకుండా పోతుందని అభిప్రాయపడ్డారు.
