Durgam Cheruvu: హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి మణిహారంగా తీర్చి దిద్దిన దుర్గం చెరువు దుర్గంధ భరితంగా మారింది. కనీసం మెయింటనెన్స్ సైతం లేక దయనీయ స్థితికి చేరుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగు నీరు వచ్చి చేరుతుండడంతో మొత్తం చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ పై కనీసం నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. చెరువు నిండా మురుగునీరు చేరడంతో కనీసం ఒక్క క్షణం కూడా నిలబడలేనంత దుర్వాసన వస్తోంది. చెరువు దుస్థితిపై పలువురు తెలంగాణ సీఎంఓ, జిహెచ్ఎంసి మేయర్, జలమండలి, ఉన్నత అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేశారు.
దుర్గం చెరువుపై పర్యవేక్షణ కరువు
ఫిర్యాదులో వాకింగ్ ట్రాక్ పై చేరిన మురుగు నీటితో పాటు, చెరువులో కలుషితమైన నీటి వీడియోలను జత చేశారు. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దిన దుర్గం చెరువుపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో దీన స్థితికి చేరుకుంది. పర్యాటకులను ఆకర్షించే స్థాయి నుంచి అటువైపుగా మళ్లీ చూడలేని స్థితికి దుర్గం చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. జిహెచ్ఎంసి మేయర్, మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే చెరువుపై చర్యలు తీసుకొని చెరువును శుభ్రం చేయడంతో పాటు, చెరువులో కలుస్తున్న మురుగును అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: RTO Vacancies: రవాణా శాఖలో ఆర్టీఓలు కొరత.. ఇన్ చార్జులతో కాలం వెల్లదీత
హైడ్రా కమిషనర్ పరిశీలించి వెళ్లినా
దుర్గం చెరువును నాలుగు రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దుర్వాసన, మురుగు నీరు చెరువులో వచ్చి కలుస్తున్న విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ అక్కడున్న వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కారిడార్‌కు కేర్ ఆఫ్‌గా నిలిచే దుర్గం చెరువు పరిస్థితి ఇలాగే కొనసాగితే. భవిష్యత్తులో అటువైపు చూసేందుకు సైతం జనం జంకే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌పై కక్షసాధింపు.. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ?