NIMS Hospital: కరోనా సమయంలో నిమ్స్ఆస్పత్రిలో జరిగిన బెడ్ల దందాపై లోకాయుక్త(Lokayukta) ఫోకస్ చేసింది. వచ్చిన ఆరోపణలు వాటిపై తీసుకున్న చర్యల గురించి నివేదికను సమర్పించాలంటూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్ డైరెక్టర్లకు తాఖీదులు జారీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నిమ్స్ఉద్యోగుల్లో ఈ అంశం చర్చనీయంగా మారింది.
అసలేం జరిగింది?
2021 కరోనా మహమ్మారి బారినపడి జనం పిట్టల్లా రాలిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలోనే కృష్ణారెడ్డి(Krishna Reddy) అనే వ్యక్తి తల్లి సుగుణమ్మ కరోనా(Corona) బారిన పడింది. దాంతో ఆమెకు చికిత్స ఇప్పించటానికి కృష్ణారెడ్డి 2021లో నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)కి వచ్చాడు. అయితే, అక్కడి సిబ్బంది బెడ్లు ఖాళీగా లేవని చెప్పారు. దాంతో దిక్కుతోచని స్థితిలో కృష్ణారెడ్డి ఉండగా ప్రశాంత్ అనే వ్యక్తి వచ్చి లక్ష రూపాయలు ఇస్తే బెడ్ ఇప్పిస్తానని చెప్పాడు.
తల్లిని బతికించుకోవటానికి కృష్ణారెడ్డి లక్ష రూపాయలను సదరు ప్రశాంత్‌కు గూగుల్ పే ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత నిమ్స్హాస్పిటల్(NIMS Hospital) డీ బ్లాక్‌లో సుగుణమ్మకు బెడ్దొరికింది. వైద్యులు చికిత్స కూడా ప్రారంభించారు. అయితే, రెండు రోజుల తరువాత మళ్లీ కృష్ణారెడ్డి వద్దకు వచ్చిన ప్రశాంత్ ఇంకో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్చేశాడు. దాంతో కృష్ణారెడ్డి(Krishna Reddy) అడ్మిషన్ కౌంటర్‌కు వెళ్లి సుగుణమ్మ కేస్ షీట్‌ను చూడగా బెడ్ కోసం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించినట్టుగా నమోదై ఉండటం కనిపించింది.
Also Read: Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం
ఇలా వెలుగులోకి..
కృష్ణారెడ్డి(Krishna Reddy)అప్పట్లో నిమ్స్ మెడికల్ సూపరిండింటెంట్‌గా ఉన్న డాక్టర్ సత్యనారాయణ(Dr. Satyanarayana)కు జరిగిన విషయాన్ని వివరిస్తూ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన లక్ష రూపాయలకు సంబంధించిన ఆధారాలు కూడా అందచేశారు. ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో ప్రశాంత్ అసలు నిమ్స్ఉద్యోగి కాదని వెల్లడైంది. సుగుణమ్మకు బెడ్ ఇవ్వాలని తనకు డిప్యూటీ సూపరిండింటెంట్డాక్టర్లక్ష్మీభాస్కర్ ఫోన్‌లో చెప్పాడని ఆర్ఎంఓ డాక్టర్ మహేందర్(Dr. Mahender) వెల్లడించటం ఆస్పత్రి వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ అంశాలన్నీ వివరిస్తూ సూపరిండింటెంట్ డాక్టర్సత్యనారాయణ ఫిర్యాదు చేయగా పంజాగుట్ట స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, నెలలు గడిచినా ఈ కేసుల్లో పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్‌చేయలేదు. అటు నిమ్స్ఉన్నతాధికారులు కూడా ఆరోపణలు వచ్చిన డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై చర్యలు తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ అప్పటి ఛీఫ్ ప్రభాకర్‌రావు ఈ కేసులో అరెస్టులు జరగకుండా చూశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
2023లో..
కాగా, 2023లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station)లో నమోదైన కేసుకు సంబంధించి లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. దీనిపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గప్‌చుప్‌గా లోక్‌అదాలత్‌లో ఎలా రాజీ కుదుర్చుకున్నారు? రాజీ కుదిర్చింది ఎవరు? అన్న ప్రశ్నలు ముందుకొచ్చాయి. అవినీతిపై నిమ్స్ ఉన్నతాధికార వర్గాలు రాజీ పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. వీటిని సేకరించిన సామాజిక కార్యకర్త రాందాస్ మన్నె జరిగిన ఉదంతంపై లోకాయుక్తకు ఇటీవల ఫిర్యాదు చేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన లోకాయుక్త తాజాగా నిమ్స్ఆస్పత్రి(NIMS Hospital)లో వెలుగు చూసిన బెడ్ల దందా పంజాగుట్ట స్టేషన్‌లో నమోదైన కేసు, దానికి సంబంధించి లోక్ అదాలత్ రాజీ కుదిరిన వైనంపై సమగ్ర వివరాలు అంద చేయాలంటూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నిమ్స్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే, తప్పు జరిగినట్టు అంతర్గత విచారణలో వెల్లడైనా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో? తెలియచేయాలని చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ అంశం వెళ్లినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో జరిగిన బెడ్‌ల దందా మరోసారి నిమ్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు