Kukatpally Lake: ఒకప్పుడు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన కుకట్‌పల్లి చెరువు ఇప్పుడు సరికొత్త జలాశయంగా మారింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పునరుద్ధరణ పనులు ఈ నెలాఖరుకు సర్వాంగ సుందరంగా పూర్తి కానున్నాయి. హైడ్రా(Hydraa) పునరుద్దరణ చేపట్టకముందు నల్ల చెరువు దయనీయ స్థితిలో ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో 30 ఎకరాలు ఉన్నప్పటికీ ఆక్రమణల కారణంగా 16 ఎకరాలకు కుంచించుకుపోయింది. చుట్టూ అక్రమ నిర్మాణాలు పెరగడంతో చెరువులోకి మురుగు నీరు వ్యర్థాలు చేరి దుర్గంధ భరితంగా తయారైంది.
30 ఎకరాల విస్తీర్ణం
స్థానికులు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. చెరువు అంటే కేవలం మురికి గుంత అన్న భావనే ఉండేది. స్థలం ఆక్రమించేందుకు కొందరు దానిని వ్యర్థాలు పారవేసే డంపింగ్ యార్డ్‌గా ఉపయోగించారు. పర్యావరణ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఇది తీవ్ర సమస్యగా మారింది. కూకట్‌పల్లి నల్ల చెరువును హైడ్రా ఒక మణి హారంగా రూపుదిద్దింది. అధికారులు రెవెన్యూ గ్రామ రికార్డులను పరిశీలించి ఆక్రమణలను తొలగించారు. దీంతో చెరువు తిరిగి 30 ఎకరాల విస్తీర్ణానికి పెరిగింది. మొదటి దశలో చెరువును పూర్తిస్థాయిలో తవ్వి పూడిక తొలగించారు. తర్వాత వర్షపు నీటితో నింపారు. ఆరు నెలల్లోనే ఈ చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండు కుండలా మారింది. కూకట్‌పల్లి నల్ల చెరువు పరిసరాలను సుందరీకరించారు. ఇందులో భాగంగా అనేక సౌకర్యాలు కల్పించారు. చెరువు చుట్టూ ప్రజలు నడవడానికి వ్యాయామం చేయడానికి అనువుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
Also Read: Talasani Srinivas Yadav: జీవో 46 మోసం త్వరలోనే అన్ని జిల్లాల్లో ధర్నా: తలసాని శ్రీనివాస్ యాదవ్
పెద్ద పిక్నిక్ స్పాట్‌లా..
చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ప్లే ఏరియాలు సిద్ధం చేశారు. చెరువుకు నలువైపులా సందర్శకులు కూర్చొనేందుకు సేద దీరేందుకు కుర్చీలు బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి కారణంగా నల్ల చెరువు ఇప్పుడు ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారింది. కూకట్‌పల్లి నల్ల చెరువు రూపురేఖలు మారిపోవడంతో స్థానికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వారాంతాల్లో ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా తయారైంది. ఉదయం సాయంత్రం వేళల్లో వందలాది మంది ఇక్కడకు చేరుకుని సేదదీరుతున్నారు. పిల్లల ఆటలకు ఇది వేదికైంది. ముఖ్యంగా, చెరువులో ఇప్పుడు బోటు షికారుకు ఏర్పాట్లు చేశారు. ఇది మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మురికి కూపం నుంచి విముక్తి పొంది సరికొత్త జలాశయంగా మారిన ఈ చెరువు కూకట్‌పల్లికి ఒక మణిహారంగా తయారైంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం అనంతరం ఈ ప్రాంతం మరింత సందడిగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Justice Suryakant: సీజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

