హైదరాబాద్: Konda Surekha: తెలంగాణలో ఎకో టూరిజంపై వేగంగా అడుగులు వేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. విదేశీయులను కూడా ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు కీలకమని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సచివాలయంలోని అటవీ మంత్రి శాఖ పేషిలో ‘తెలంగాణ హరిత నిధి’ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఏలూ సింగ్ మేరు, డాక్టర్ సువర్ణ(క్యాంపా), సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం(సోషల్ ఫారెస్టు), డాక్టర్ బీమా నాయక్, డాక్టర్ ప్రభాకర్,(సీసీఎఫ్), పలు జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థిక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరితనిధి వినియోగంపై సమగ్రంగా చర్చించారు. నర్సరీలను ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు మంత్రి సురేఖ ప్రత్యేక సూచనలు చేశారు.
Also Read: SLBC Tunnel Update: ఎస్‌ఎల్‌బీసీ పై కీలక అప్డేట్.. 12 మందితో కమిటీ ఏర్పాటు!
2024-25 హరిత నిధి బడ్జెట్, 2025-26 బడ్జెట్ మీద మంత్రి అనుమతులను అధికారులు స్వీకరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, మన రాష్ట్రం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని గుర్తు చేశారు. ఏమైనా పెండింగ్ అంశాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫారెస్ట్ ఫైర్స్ మీద కూడా సమావేశంలో చర్చ జరగ్గా వాటిని తగ్గించేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలపై మంత్రి ఆరా తీశారు. వీటిపై రానున్న రోజుల్లో మరింత శ్రాస్త్రీయంగా ముందుకు వెళ్ళేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఎప్పటికప్పడు తమకు తెలియజేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
వానరాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో వానరాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఒకసారి వనాలను వీడిన వానరాలు మళ్ళీ అడవి బాట పట్టవని, అందువల్ల వాటి కోసం కొన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరిత నిధిలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలలో ఇచ్చే మొక్కల్లో ఎక్కువగా వానరాలు తినే మొక్కలు అందజేయాలని సూచించారు. దాని వల్ల వాటిని సంరక్షించినట్టు అవుతుందని చెప్పారు. ఈ విషయంపై సమగ్రంగా నివేదికలు తయారు చేసుకోని ముందుకు వెళ్ళాలని అన్నారు.
Also Read: CM Revanth Japan Tour: జపాన్ లో సీఎం రేవంత్.. ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసింది..