GHMC: దేశంలోని అతి పెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో మళ్లీ అంతర్గత మార్పులు తప్పని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, నాన్ క్యాడర్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ సర్కారు జారీ చేసిన ఆదేశాల ఎఫెక్టుతో జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత బదిలీలు తప్పని పరిస్థితి నెలకొంది. ఈ బదిలీలతో ఒక్క సికిందరాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావులు మినహా మిగిలిన వారిలో కొందర్ని అదనపు కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ సర్కారు బాధ్యతలను అప్పగించింది. జీహెచ్ఎంసీలో కీలక విభాగాలైన రెవెన్యూ, ఐటీ, ఫైనాన్స్ విభాగాలతో పాటు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన అనురాగ్ జయంతిని కొత్తగా ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ జోన్ కు జోనల్ కమిషనర్ గా నియమించటంతో ఆయన సీటు ఖాళీ అయింది. ఆయన నిర్వర్తించిన విధులు ఎవరికి అప్పగించాలన్న విషయంపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఆ బాధ్యతలను అప్పగిస్తారా?
ఇప్పటికే ఎలాంటి బాధ్యతలు లేకుండా ఖాళీగా ఉన్న అధికారికి ఆ బాధ్యతలను అప్పగిస్తారా? లేక ఇప్పటికే వివిధ రకాల బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారికి అదనంగా బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ నెలకొంది. దీనికి తోడు నిన్న మొన్నటి వరకు అదనపు కమిషనర్ (ఎలక్షన్) తో పాటు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన హేమంత్ కేశవ్ పాటిల్ ను తాజాగా చేసిన బదిలీల్లో ఆయనకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ బాధ్యతలు మాత్రమే అప్పగించటంతో అదనపు కమిషనర్ (ఎలక్షన్) సీటు కూడా ఖాళీ అయింది. ఈ బాధ్యతలను కూడా కమిషనర్ ఎవరికి అప్పగిస్తారోనన్న చర్చ లేకపోలేదు. దీంతో పాటు ప్రస్తుతం ఎలాంటి బాధ్యతల్లేకుండా కొనసాగుతున్న అదనపు కమిషనర్ గీతారాధిక కొద్ది నెలల క్రితం రెండు నెలలు సెలవులో వెళ్లటంతో ఆయన చూస్తున్న ఫైనాన్స్ విభాగాన్ని కమిషనర్ అప్పట్లో అదనపు కమిషనర్ అనురాగ్ జయంతికి అదనపు బాధ్యతలుగా అప్పగించారు.
Also Read: GHMC: డీలిమిటేషన్‌కు లైన్ క్లియర్.. మ్యాప్‌లు, జనాభా లెక్కలివ్వాలని కోర్టు ఆదేశం!
ఎలక్షన్ వింగ్ బాధ్యతలు మాత్రమే అప్పగిస్తారా?
ఇపుడు అనురాగ్ జోనల్ కమిషనర్ గా బదిలీ కావటంతో ఆయన చూసిన రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ విభాగాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఇదివరకే చాలా కాలంగా ఫైనాన్స్ విభాగానికి అదనపు కమిషనర్ గా విధులు నిర్వర్తించిన గీతారాధికకే మళ్లీ ఆ విభాగాన్ని అప్పగిస్తారా? లేక ఎలక్షన్ వింగ్ బాధ్యతలు మాత్రమే అప్పగిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో చాలా ముఖ్యమైన కీలకమైన ఐటీ, రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించేందుకు ఇతర నాన్ క్యాడర్ అధికారులెవరూ కూడా లేకపోవటం, మరో వైపు ట్యాక్స్ కలెక్షన్ కీలక దశకు చేరటంతో వీలైనంత త్వరగా ఫైనాన్స్, రెవెన్యూలకు అదనపు కమిషనర్ ను నియమించాల్సిన అవసరముంది. ఇదిలా ఉండగా, గతంలో జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్లుగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ ఆఫీసర్లు ప్రియాంక ఆల, సందీప్ కుమార్ ఝా లు మళ్లీ జోనల్ కమిషనర్లుగా జీహెచ్ఎంసీలోనే పోస్టింగ్ లు పొందారు.
కమిషనర్ గా కర్ణన్ కొనసాగుతారా?
27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ దేశంలోనే అతి పెద్ద నగరంగా ఏర్పడటంతో పాటు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున ఆ తర్వాత కూడా కమిషనర్ కర్ణన్ జీహెచ్ఎంసీలోనే కొనసాగుతారా? లేక సర్కారు స్పెషలాఫీసర్ గా ఇతర సీనియర్ క్యాడర్ స్థాయి అధికారిని నియమిస్తుందా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. పాలకమండలి గడువు ముగిసిన తర్వాత స్పెషలాఫీసర్ పాలన రానున్నందున, కర్ణన్ క్యాడర్ స్పెషలాఫీసర్ స్థాయికి సరిపోనందున ఆయన స్థానంలో వేరే అధికారిని నియమించనున్నట్లు చర్చ జరుగుతుంది. కానీ స్పెషలాఫీసర్ గా వేరే అధికారిని నియమించినా, కమిషనర్ గా కర్ణనే కొనసాగుతారన్న వాదనలు కూడా లేకపోలేవు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ పరిధిని మూడు ముక్కలుగా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే మూడు ముక్కల్లో ఒక ముక్కగా ఏర్పడనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కర్ణనే కమిషనర్ గా కొనసాగించే అవకాశాలున్నట్లు వాదనల్లేకపోలేవు.
Also Read: GHMC: డీలిమిటేషన్ పై ముగిసిన స్టడీ.. సర్కారుకు నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ!

