AI-powered Smartphone Tool: హైదరాబాద్‌కు చెందిన నేత్ర వైద్యులు ఒక విప్లవాత్మకమైన ఏఐ సాధనంను అభివృద్ధి చేశారు. దానిని పరీక్షించి మంచి ఫలితాలను సైతం సాధించారు. పరిశోధనలో భాగంగా తాము సృష్టించిన ఏఐ ఆధారిత స్మార్ట్ ఫోన్ కెమెరాతో రోగుల్లోని గ్లాకోమాను 92.02% ఖచ్చితత్వంతో గుర్తించగలిగామని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు సాధనం ప్రారంభ దశ గ్లాకోమాను గుర్తించడంలో 86.9% ఖచ్చితత్వంను సాధించామని తెలిపారు.
ఎల్వీ ప్రసాద్ వైద్యుల ఆధ్వర్యంలో..
ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనం.. ప్రతిష్టాత్మ పీఎల్ఓఎస్ వన్ (PLOS One) జర్నల్ లో ప్రచురితమైంది. దాని ప్రకారం హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ (LVPEI) వైద్యులు ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ ఫోన్ కెమెరాను సృష్టించారు. ఉన్నత వైద్య కేంద్రానికి రిఫరల్ అవసరమైన కేసులను గుర్తించడంలో ఈ ఏఐ సాధనం 94.12% ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది.
గ్లాకోమా గుర్తింపులో మైలురాయి
గ్లాకోమా అనేది ఆప్టిక్ నర్వ్ (దృష్టి నాడి)ను దెబ్బతీసే నేత్ర వ్యాధుల సమూహం. దీన్ని ముందుగానే గుర్తించడం అత్యంత ముఖ్యం. లేదంటే కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏఐ సాధనం ద్వారా ఆ ముప్పును తప్పించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా అధిక ప్రమాదంలో ఉన్నవారికి, వైద్య సేవలు తక్కువగా అందుతున్న సముదాయాలకు ఈ సాధనం అద్భుతంగా ఉపయోగపడగలదు.
పరిశోధన వివరాలు
పరిశోధన దశలో మెుత్తం 213 మంది రోగులను నేత్ర వైద్యులు పరిశీలించినట్లు పీఎల్ఓఎస్ వన్ జర్నల్ తెలిపింది. గ్లాకోమా ముప్పు అధికంగా ఉన్న వారినే ఈ పరిశోధనకు ఎంపిక చేశారు. 65 సంవత్సరాలు పైబడిన రోగుల్లో ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ ఫోన్ ద్వారా గ్లాకోమాను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 90.57 శాతం కచ్చితత్వంలో ఆ సాధనం ఫలితాన్ని ఇచ్చింది. అలాగే మధుమేహంతో బాధపడుతున్న 45 మంది రోగుల్లో 42 మందికి గ్లాకోమా ఉన్నట్లు ఏఐ సాధనం గుర్తించింది.
Also Read: Wagah-Attari Border: పాక్ దౌర్భాగ్యం చూశారా.. ప్రకృతి కూడా ఆటపట్టిస్తోంది.. వైరల్ వీడియో
గ్రామీణ ప్రాంతాలకు అనుకూలం
పరిశోధకుల ప్రకారం.. ఈ AI సాధనం తక్కువ ఖర్చుతో, సులభంగా తరలించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంటర్నెట్ లేని మారుమూల గ్రామాల్లోనూ దీన్ని సమర్థవంతంగా వినియోగించవచ్చు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించడానికి ఇది ఎంతో అనువైనదని పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో అది తప్పనిసరి!
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
తమ అధ్యయనం వాస్తవ పరిస్థితుల్లోనూ AI ఆధారిత పద్ధతి ఎంత సమర్థంగా పనిచేస్తుందో నిరూపించిందని పరిశోధకులు అన్నారు ‘రిఫరల్ అవసరమైన గ్లాకోమా కేసులను గుర్తించడంలో, గ్లాకోమా నిపుణుల నిర్ధారణతో పోలిస్తే AI సాధనం అధిక పనితీరును చూపింది. అధిక దశ గ్లాకోమా గుర్తింపులో అత్యధిక ఖచ్చితత్వం కనబరిచింది. ఆ తర్వాత మధ్యస్థ, రారంభ దశ గ్లాకోమా గుర్తింపులోనూ మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాధనం ఒక గొప్ప ఆశాకిరణంగా నిలుస్తుంది’ అని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ పరిశోధకుల బృందం వివరించింది.