Kancha Gachibowli Land: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో మంత్రుల పాత్ర ఏంటి.. ఎక్కువ మంది మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు… ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినా ఒక్కరిద్దరే ఎందుకు స్పందిస్తున్నారు… ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్ధించే తీరులో ఎందుకు ఓపెన్ కావడంలేదు.. ఇలాంటి చర్చలు తాజాగా ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.ఇదే విషయాన్ని కొందరు మంత్రుల దగ్గర ప్రస్తావిస్తే కొందరి నుంచి నో కామెంట్… మరికొందరి నుంచి క్యాబినెట్‌లో దీనిపై చర్చ జరగలేదు గదా.. నిర్ణయం తీసుకోలేదు గదా.. అనే కామెంట్లు వినిపించాయి. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విపక్షాలు, విద్యార్థులు, కొన్ని పర్యావరణ ఎన్జీవోలు విమర్శిస్తున్నా సైలెంట్‌గానే ఉండిపోతున్నారు. చివరకు న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకుని చీఫ్ సెక్రెటరీని మందలించడం, ప్రభుత్వానికి ఆంక్షలు విధించడం, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం.. ప్రభుత్వానికి సంకటంగా మారాయి.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మంత్రులంతా సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉన్నా కొందరు మంత్రులు ఈ వ్యవహారంలో ఎవరికి వారే యమునా తీరే తరహాలో వ్యవహరించడం, నిర్ణయాన్ని సమర్ధించుకునే తీరులో మాట్లాడకపోవడం సచివాలయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో భూములకున్న ప్రభుత్వ, మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఖజానాకు ఉపయోగపడేలా నిర్ణయం జరిగినా మంత్రులు మౌనంగా ఉండడం గమనార్హం.
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవే అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా దాన్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడంలో రాష్ట్ర సర్కార్ పెద్దగా చొరవ చూపలేదన్న అపవాదు ఉండనే ఉన్నది. అప్పట్లోనే దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఉన్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వర్గాలు ఆ భూములు తమవేననే వాదనను తెరపైకి తెచ్చేది కాదనే మాటలూ వినిపిస్తున్నాయి.
ఆర్థికంగా రాష్ట్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నందున సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవసరాలకు కావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని ఆ భూమిని వేలం వేయాలన్నది ప్రభుత్వ పెద్దల భావన. ఈ భూములను డెవలప్ చేసి వేలం వేయడంపై క్యాబినెట్ సమావేశాల్లో అంతర్గతంగా చూచాయగానైనా చర్చ జరిగిందా.. సీనియర్ మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకున్నారా.. అనే చర్చ కూడా జరుగుతున్నది.
మెజారిటీ మంత్రులు సైలెంట్‌గా ఉండడమే చర్చనీయాంశమైంది. వివాదం తలెత్తగానే పరిష్కార మార్గాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు (పరిశ్రమలు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (రెవెన్యూ)లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ముగ్గురూ సమీక్ష నిర్వహించి ఒక్కసారి మాత్రమే మీడియా సమావేశాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారనే విమర్శ నెలకొన్నది.
Also read: MLA Raja Singh: వరుస స్టేట్ మెంట్లతో బీజేపీ షేక్.. ఎట్టకేలకు సెట్!
మంత్రి శ్రీధర్‌బాబు తాజా ప్రెస్‌మీట్‌లో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడంపై దృష్టి పెట్టారు. ఆలస్యంగా స్పందించడాన్ని వేలెత్తి చూపినట్లయింది. కోర్టు లేవనెత్తిన అంశాలను, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ప్రస్తావించిన అంశాలను, విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చేలా మంత్రి క్లారిటీ ఇవ్వలేదన్న మాటలూ వినిపించాయి. మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అంతుచిక్కని అంశంగానే ఉండిపోయింది.
గతంలో మూసీ పునరుజ్జీవం విషయంలో ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షాలు అడ్డుకున్నప్పుడూ కొందరు మంత్రులు అంటీముట్టనట్లుగానే వ్యవహించారు. హైడ్రా విషయంలోనూ ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే కొందరు మంత్రులు మౌనంగా ఉండిపోయారు. రుణమాఫీ విషయంలో విపక్షాలు ముప్పేట దాడిచేస్తున్నా ముఖ్యమంత్రికి మంత్రుల నుంచి అనుకున్నంత మద్దతు లభించలేదనే చర్చ అప్పట్లోనే జోరుగా జరిగింది.
రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్ధించకపోగా విపక్షాల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టడానికి మంత్రులు ఆసక్తి చూపకపోవడమే ప్రధాన చర్చనీయాంశమైంది.