Balkapur Nala: కాదేదీ అనర్హం కబ్జాకు అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ అధికారుల అండదండలు చూసుకొని విర్రవీగుతున్నారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. మణికొండ సర్కిల్ పరిధిలో బుల్కాపూర్ నాలా రోజురోజుకు కుచించుకుపోతుంది. గండిపేట్ మండలం పరిధిలోని మణికొండ సర్కిల్ మణికొండ మర్రిచెట్టు సమీపంలోని సర్వే నెంబర్ 262 బుల్కాపూర్ నాలా ఉంది. ఈ నాలాను మూసివేసి ఓ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తున్నది. రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు తెలిసి జరుగుతుంటే ఎందుకు ఆపడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. రానున్న కాలంలో బుల్కాపూర్ నాలా పలానా చోటు ఉండేదని పేపర్లలో బుక్కుల్లో చదువుకునే పరిస్థితులు వస్తాయా అని ప్రజలు మండిపడుతున్నారు.
అనుమతులు ఎలా..?
బుల్కాపూర్ నాలాను ఆనుకొని నిర్మాణం చేస్తున్న బఫర్‌లో 40 మీటర్లు ఉండాలని స్థానికులు చెబుతున్నా, అధికారులు 20 మీటర్లు అంటున్నారు. అధికారులు చెప్పిన లెక్క ప్రకారం అయినా అక్కడ బఫర్ జోన్ విడిచి నిర్మాణాలు చేస్తున్నారంటే అది లేదు, అధికారులు వస్తే వారిని ఎలా బుట్టలో వేసుకోవాలో నిర్మాణ దారులకు కొట్టినపిండి అని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. అక్కడ బుల్కాపూర్ నాలా ఉన్నప్పటికీ ఆయా నిర్మాణాలకు మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తుంటే ప్రశ్నించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం అక్రమ నిర్మాణదారులకు వరంగా మారిందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. నాలాల బఫర్ జోన్‌లో స్థానిక లీడర్ల సపోర్టుతో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే బుల్కాపూర్ నాలా కనుమరుగయ్యే అవకాశం ఉందని ప్రజలు తెలుపుతున్నారు.
Also Read: Mahesh Kumar Goud: కవిత బీఆర్ఎస్ బ్యాటింగ్ దంచి కొడుతోంది: మహేష్ కుమార్ గౌడ్
హైడ్రా అధికారుల చర్యలేవీ?
నాలా బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో హైడ్రా అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. హైడ్రా పేరు అంటేనే హడలిపోయే సామాన్యులు, ఈ నిర్మాణాల విషయంలో ఏమి చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా హైడ్రా పని తీరు ఉందని ప్రజలు చెబుతున్న పరిస్థితి. కేవలం వచ్చి పరిశీలించడానికే అధికారులు పరిమితం అవుతున్నారని, కానీ చర్యలు తీసుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆక్రమణలు బఫర్ జోన్‌లోకి వస్తుందనేది జగమెరిగిన సత్యం. అధికారుల నిర్లక్ష్యం, ఇరిగేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. కేవలం చూసి వెళ్లిపోతున్నారు. మూడు రోజుల క్రితం పరిశీలనకు అధికారులు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం.
కొనుగోలుదారుల నోట్లో మట్టే!
చుట్టుపక్కల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ బుల్కాపూర్ నాలాను ఆనుకొని నిర్మాణాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో ఈ నిర్మాణాలను కళ్లు చెదిరిపోయేలా చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాల గురించి తెలియని కొందరు అమాయకులు కొనుగోలు చేసి నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు కొనుగోలు చేసే క్రమంలో ఇలాంటి నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలాంటి నిర్మాణాలు కొనుగోలు చేస్తే సామాన్యుడి నోట్లో మట్టేనని ప్రజలు వాపోతున్నారు. నిర్మాణాలు బాగుండటంతో కొనుగోళ్లు జరిగితే కొనుగోలుదారులే నష్టపోతారని, అధికారులు ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: AI in TG Schools: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కార్ బడుల్లో ఏఐ పాఠాలు..!

