Secunderabad Patny: సికిందరాబాద్ ప్యాట్నీ నగర్ నాలా పక్కనే స్వయం భూ వెలిసిన అమ్మవారి విగ్రహాం గుడిలో నుంచి మాయమైంది. స్థానికంగా సంచలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్యాట్నీ నగర్ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించే పనులను కంటోన్మెంట్ బోర్డు, హైడ్రా(Hydraa), హెచ్ఎండీఏ(HMDA)లు ఇటీవలే ప్రారంభించారు. 1940 సంవత్సరంలో ఇక్కడ స్వయం భూ వెలిసిన అమ్మవారి విగ్రహానికి ప్యాట్నీ ఫ్యామిలీ ఒక దేవాలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయంలో ప్రతి రోజు దూపదీప నైవేధ్యాలను నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఏడుగంటలకు పూజాధికాలను నిర్వహిస్తున్నారు.
హెచ్ఎండీఏ సిబ్బందిపై ఆరా
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అమ్మవారికి పూజాధికాలను నిర్వహించేందుకు పంతులు రాగా, గుడిలోని అమ్మవారి విగ్రహం ఇంకా ఇతర దేవతామూర్తుల ఫొటోలు కన్పించలేదు. పంతులు ఈ విషయాన్ని వెంటనే ప్యాట్నీ ఫ్యామిలీ సభ్యులకు తెలియజేశారు. దీంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న ప్యాట్నీ ఫ్యామిలీ మెంబర్లు తొలుత అక్కడ పని చేస్తున్న హైడ్రా(Hydraa), కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండీఏ(HMDA) సిబ్బందిని ఆరా తీశారు. సిబ్బంది తమకేమీ తెలియదని, తాము ఎలాంటి విగ్రహాలను తొలగించలేదని స్పష్టం చేయటంతో దేవాలయం ఆవరణలో నిరసన చేపట్టిన ప్యాట్నీ ఫ్యామీల సభ్యులు ఆ తర్వాత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Drunk Driving: రోజురోజుకు పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
సాంప్రదాయబద్దంగా శాంతి పూజలు
పనుల కారణంగా దేవాలయంతో ఏమైనా అంతరాయం కల్గితే ముందుగా తమకు సమాచారమిస్తే, అమ్మవారి విగ్రహాన్ని తామే సాంప్రదాయబద్దంగా శాంతి పూజలు నిర్వహించి, వేరే చోటుకు మార్చుకుంటామని ప్యాట్నీ ఫ్యామిలీ సూచించినట్లు తెలిసింది. కానీ అక్కడ పని చేస్తున్న హైడ్రా, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండీఏ సిబ్బంది స్వయం భూ వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని తరలించకుంటే, మరీ విగ్రహాం, ఇతర దేవతల ఫొటోలను ఎవరు తొలగించారన్నది మిస్టరీగా మారింది. ఈ స్థలానికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు, ప్యాట్నీ ఫ్యామిలీ మెంబర్ల మధ్య ఇప్పటికే కోర్టులో వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. నేడు కోర్టులో హియరింగ్ కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ, హైడ్రా, కంటోన్మెంట్, హెచ్ఎండీఏ అధికారులు పనులు చేస్తూ దేవాలయం చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించి, ఇప్పుడు విగ్రహాలు లేకుండా చేయడంపై ప్యాట్నీ ఫ్యామిలీ మెంబర్లు మండిపడుతున్నారు.