Hydraa: ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు కబ్జాల నుంచి విముక్తి కలిగించిన హైడ్రా ఇప్పుడు నాలా ఆక్రమణలపై ఫోకస్ చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచి హైడ్రా ప్రత్యేకంగా నాలా ఆక్రమణల పై ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. స్వీకరించిన ఫిర్యాదులను ఫీల్డ్ లెవల్ లో కమిషనర్ రంగనాథ్ వెరిఫై చేసిన తర్వాత కబ్జాలేనని నిర్ధారించుకునీ, యాక్షన్ మొదలుపెట్టినట్లు సమాచారం. నగర నడిబొడ్డున సికింద్రాబాద్ లోని ప్యాట్నీ ప్రాంతంలో నాలాపై నిర్మించిన వాణిజ్య కట్టడాలను హైడ్రా శుక్రవారం తొలగించింది. 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన నాల కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు పరిమితమైన ప్రాంతాలను గుర్తించి హైడ్రా ఆక్రమణల పై ఉక్కు పాదంమోపింది.
ముంపు ప్రాంతాల ప్రజల ఫిర్యాదులు
ప్యాట్నీ నాలా కబ్జాలకు గురి కావడంతో పైగా కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాన నగర్, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ నీట మునుగుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో హైడ్రా ఆక్రమణలను హైడ్రా నీలమట్టం చేసినట్లు సమాచారం. గతంలో కంటోన్మెంట్ అధికారులకు కూడా ఆక్రమణలు తొలగించాలని ముంపు ప్రాంతాల ప్రజలుఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదులను కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించిన తర్వాతే కూల్చివేతలకు సిద్ధమైనట్టు తెలిసింది.
Also Read: Medchal Govt Hospital: ఆసుపత్రి భవన నిర్మాణానికి.. మోక్షమెప్పుడో?
భవిష్యత్ లో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు
హైదరాబాద్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల ఫీల్డ్ విజిట్ లో స్థానికులు నాలా ఆక్రమణలతో వేలాది నివాసాలు నీట మునిగిన పాత చిత్రాలను సెల్ ఫోన్ లో చూపించి తమను కాపాడాలంటూ వేడుకున్నట్లు సమాచారం. అలాగే భవిష్యత్ లో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలకు ఇరువైపులా ప్రహరీలు నిర్మించాలని నిర్ణయించిన కంటోన్మెంట్ అధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
కూల్చివేతలు చేపట్టడం పట్ల స్థానికుల ఆనందం
శుక్రవారం హైడ్రా చేపట్టిన ఆక్రమణలు తొలగింపుతో దాదాపు 5 కాలనీల ప్రాంతాలకు వరద ముప్పు తప్పినట్లు స్థానికులు తెలిపారు. నాలా ఆక్రమణలు జరిగితే కూల్చివేయాలన్న, హై కోర్టు, సుప్రీమ్ కోర్టు తీర్పులు అమలవుతున్నందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణలు జిహెచ్ఎంసి తొలగిస్తుందా? లేక కంటోన్మెంట్ చేస్తుందా? అనే అయోమయానికి చెక్ పెడుతూ హైడ్రా కూల్చివేతలు చేపట్టడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. హస్మత్ పేట చెరువు వరద నీటిని తెచ్చే హస్మత్ పేట నాలా, మహేంద్ర హిల్స్ పై భాగం నుంచి వరద నీటిని తెచ్చే పికెట్ నాల 23 కిలోమీటర్ల మేర ప్రయాణించి ప్యాట్నీ నాలా పై ఆక్రమణలను హైడ్రా తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!