Hydraa: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న దుర్గంచెరువును కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపిస్తోంది. మాధాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించింది. మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెలా రూ. 50 లక్షల వరకూ అద్దెలు వసూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. తర్వాత మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. అక్కడ బాహాటంగా జరిగిన కబ్జాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేయమని ఆదేశించారు. ఈమేరకు పరిశీలించిన హైడ్రా అధికారులు.. కబ్జాలను నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.
ఆక్రమణల దుర్గంధం
ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న దుర్గం చెరువు నేడు 116 ఎకరాలుగా మిగిలిపోయింది. చెరువుకు ఉత్తర దిశ తప్పితే.. మూడువైపులా ఆక్రమణలకు గురైంది. 1976 నాటికే 29 ఎకరాల వరకూ కబ్జా అయి.. 131.66 ఎకరాలకు మిగిలిపోయింది. 1976వ సంవత్సరం నుంచి 1995 వరకూ భద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకూ మరో 10 ఎకరాల మేర కబ్జాకు గురై..121 ఎకరాలకు కుంచించుకుపోయింది. 2000 నుంచి నేటికి మరో 5 ఎకరాలు కబ్జాకు గురయ్యింది. ఇలా ఎప్పుడు ఏ సంవత్సరంలో కబ్జాల పర్వం ఎలా సాగిందో ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి.
మట్టితో నింపుతూ ఆక్రమణలు..
మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపి క్రమంగా చెరువులోకి జరిగి ఏకంగా 5 ఎకరాలను కబ్జా చేశారు. అలా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమించిన స్థలం నాదంటూ ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు క్లైం చేస్తున్నారు. అంతే కాదు.. స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్‌తో ప్రతి నెల రూ. 50 లక్షల వరకూ అద్దెలు అనుభవిస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్కడ పార్కింగ్ దందా చేస్తున్నారు.
Also Read: Harish Rao on CM Revanth: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు నీళ్ల ద్రోహి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
2014లో 160.7 ఎకరాలు
నెమ్మదిగా మట్టిని నింపుకుంటూ ఎకరం నుంచి 5 ఎకరాల వరకూ ఆ ప్రజా ప్రతినిధి ఆక్రమించేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమణ అడ్డుగా మారింది. ఆయనదని చెబుతున్న భూమే ప్రతి ఏటా పెరుగుతుండడం గమనార్హం. హెచ్ ఎం డీ ఏ మాత్రం 2014లో 160.7 ఎకరాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమనరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ ఆర్ ఎస్ సీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశల్యాన్ని తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఈలోపు చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తోంది.

