Harish Rao on CM Revanth: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ కావడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలకు గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు లభించాయని హరీశ్ రావు ఆరోపించారు.
బీజేపీకి ఎంత ధైర్యం?
బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి రావడాన్ని ఖండిస్తూ తెలంగాణ భవన్ లో హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జలదోపిడికి ఆదిత్యనాథ్ దాస్ సూత్రదారి అని ఆరోపించారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సూచించారు. కత్తి ఆంధ్రా వాళ్లది.. తెలంగాణను పొడిచేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డే అంటూ ఘాటుగా విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు CWC అనుమతి ఇచ్చేందుకు బీజేపీకి ఎంత దైర్యమంటూ ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని హరీశ్ రావు పట్టుబట్టారు. ఇందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అదే సమయంలో సీడబ్ల్యూసీ రద్దు చేయాలని దిల్లీలో దర్నా చేద్దామని అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
రేవంత్ నీళ్ల ద్రోహి..
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్రా అయినంత మాత్రానా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి ఆనాడు ఉద్యమ ద్రోహి.. ఈనాడు నీళ్ల ద్రోహి’ అని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ఆదిత్య నాథ్ దాస్ ను కమిటీ హెడ్ గా నియమించారని ఆరోపించారు. బనకచర్ల ద్వారా ఆంద్ర నీళ్లు తీసుకోవచ్చు అని ఆయన సీడబ్ల్యూసీకి లేఖ రాశారని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ మెుద్దు నిద్ర పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Battle of Galwan: గల్వాన్ సినిమాపై చైనా అక్కసు.. భారత్ స్ట్రాంగ్ రియాక్షన్.. డ్రాగన్‌కు చురకలు!
మంత్రి ఉత్తమ్‌పై ఆగ్రహం
తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనా హరీశ్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే సరిపోతుంది. ప్రభుత్వం నిద్ర పోతుందా, నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదు. నీళ్ల అంశంలో నేను ఎటువంటి రాజకీయాలు చేయడం లేదు. బాధ, ఆవేదనతో మాట్లాడుతున్నా’ అంటూ హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

