Hydra: గ్రేటర్ పరిధిలోని ట్రై సిటి లోని సర్కారు భూములను కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా (Hydra) మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. షేక్పేట్ మండలంలోని బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నెంబర్ 10 లో రూ.750 కోట్ల భూమిని హైడ్రా కాపాడింది. మొత్తం ఐదు ఎకరాల భూమిలో సర్కారు గతంలో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. కానీ జలమండలి కేటాయించిన 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టు లో కేసు వేశాడు. ఐదు ఎకరాల భూమికి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు లు నిర్మించుకున్నాడు.
Also Read: Hydra Commissioner: ప్రజావాణి ఫిర్యాదులపై.. హైడ్రా కమిషనర్ పర్యటన
హైడ్రా రంగంలోకి
ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అనేక నివప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ బోర్డు రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి చేస్తున్న ప్రయత్నాలను కూడా పార్థసారధి అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో జలమండలి, రెవెన్యూ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి ఆక్రమించుకునేందుకు పార్థసారథి ప్రయత్నాలు చేస్తున్నారని హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ, జలమండలి అధికారులు నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేయించినట్లు హైడ్రా వెల్లడించింది.
హైడ్రా ఆక్రమణలను తొలగింపు
వాస్తవానికి 403 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించినట్లు హైడ్రా వెల్లడించింది. అన్న్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా ఆక్రమణలను తొలగించింది. షేక్ పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
Also Read: Hydra: శంషాబాద్ లో హైడ్రా యాక్షన్.. రూ. 500 కోట్ల విలువైన భూమి స్వాధీనం
