Hydra Commissioner: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner )ఏవీ రంగనాథ్ (AV Ranganath) క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిస్థితులను పర్యవేక్షించారు. తూముకుంట మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అదే మార్గంలో కొత్తగా కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తున్న క్రమంలో రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానిక మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవరాయాంజాల్ విలేజ్ లోని వరద కాలువ ఆక్రమణలను పరిశీలించారు.
Also Read: Medchal: బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.. పటాకులు కాల్చే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
వరద కాలువ పునరుద్దరించాలి
తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జా కావడంతో 4 కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు చేసిన ఫిర్యాదుపై కమిషనర్ పరిస్థితులను బుధవారం పరిశీలించారు. గ్రామ రికార్డ్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ ఆర్ ఎస్ సీ మ్యాప్ ల ఆధారంగా గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండేదో పరిశీలించి, ఆక్రమణలు తొలగించి వరద కాలువను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.తర్వాత తూముకుంట విలేజ్ లోని వాసవి సుచిరిండియా లే ఔట్ లో నాలా కుంచించుకుపోవడాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
వెంచర్ యజమానులతో త్వరలో సమావేశం ఏర్పాటు
దేవరాయాంజాల్ చెరువు, పోతాయిపల్లి చెరువు నుంచి గుండ్లకుంట చెరువుకు వెళ్లే వరద కాలువ వాస్తవ వెడల్పు కొనసాగించకుండా నిర్మించడాన్ని పరిశీలించారు. 9 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలాను కేవలం రెండు మీటర్లకే పరిమితం చేయడం వల్ల అదే వెంచర్ లోని ప్లాట్లతో పాటు పై భాగంలో ఉన్న నివాసాలు కూడా మునిగిపోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన వీడియోలు చూపించారు. ఓపెన్ నాలా ఉండాల్సిన చోట పైపులు వేయడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, మున్సిపాల్టీ అధికారులతో పాటు వెంచర్ యజమానులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు ఉన్నారు.
Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్
