Hyderabad: హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కొట్టేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకూ ధర పలుకుతోంది. ఈ లెక్కన కాపాడిన భూమి విలువ దాదాపు రూ.700ల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
హైడ్రాను ఆశ్రయించిన బాధితులు..
కొండాపూర్ లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వేంకటేశ్వర హెచ్. ఏ.ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 గజాల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పడివే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్.ఏ.ఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత పత్రాలతో ఫిర్యాదు చేశారు.
Also Read: Traveller: 197 దేశాలను చుట్టొచ్చాడు.. వరస్ట్ నగరం ఎప్పటికీ అదేనట.. ఎందుకో తెలిస్తే షాకే!
హైకోర్టు ఆదేశాల ప్రకారం..
ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయ్యింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేసినట్లు తేలింది. మరోవైపు రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకున్న హైడ్రా అధికారులు.. ఆక్రమణకు గురైన పార్కుల చుట్టూ శుక్రవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
