Hydraa Commissioner: ప్రజావాణిలో స్వీకరించే ప్రతి ఫిర్యాదుకు సంబంధించి ఇరు వర్గాలను పిలిపించి, చర్చిస్తామని, ఆ తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించి స్వీకరించిన ఫిర్యాదులపై ఆయన బుధవారం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి విలేజ్ లోని రంగనాథ్ నగర్ ను హైడ్రా కమిషనర్ సందర్శించగానే స్థానికులు ఆయన్ను కలిసిన రంగనాథ నగర్ ప్లాట్ యజమానులు తమ లే అవుట్ మొత్తం కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్లాట్ ఓనర్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై వాకబు చేశారు. త్వరలోనే ఇరువర్గాల వారిని పిలిచి చర్చలు జరుపుతామని, త్వరలోనే మీ సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. 1985 లో 184 ఎకరాల పరిధిలో 850కి పైగా ప్లాట్లతో లే అవుట్ వేస్తే తామంతా ప్లాట్లు కొనుగోలు చేశామని వివరించారు. 2021 కరోనా సమయంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిలలాడితే, బడా రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు సమూహంగా ఏర్పడి మా లే అవుట్ మొత్తాన్ని కబ్జా చేశారంటూ కమిషనర్ ముందు ప్లాట్ ఓనర్లు వాపోయారు.
Also read: Crime News: మహిళా డాక్టర్‌పై.. మరో డాక్టర్ అత్యాచారం!
అప్పటికే కొంతమంది ఇళ్లను కట్టుకుని ఉండగా, మమ్మల్ని తరిమేసి ఇండ్లను నేలమట్టం చేసి రహదారులు, పార్కులు కలిపేసి వ్యవసాయ భూమిగా మార్చేశారని వాపోయారు. చివరకు లే అవుట్ లో ఉన్న దేవాలయానికి కూడా వదల్లేదని వారు ఫిర్యాదు చేశారు. తాము కోర్టులను ఆశ్రయించామని, వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లిందని బాధితులు తెలిపారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు హై కోర్టు తమకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని తీర్పు ఇచ్చినట్లు కమిషనర్ కు వివరించారు.
ఈ తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ నోడల్ అధికారికి ఆదేశాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన తమ ప్లాట్ ఉందని, అక్కడకు వెళితే తమపై దాడులు చేశారంటూ కొందరు ప్లాట్ ఓనర్లు కన్నీరుమున్నీరయ్యారు. నిత్యం వందలాది మంది బౌన్సర్ల ను అక్కడ కాపలా పెట్టి, అటు వైపు కనీసం చూడడానికి కూడా వీల్లేకుండా చేశారని వారు ఆరోపించారు.
వారం, పది రోజుల్లో పిలిపించి మాట్లాడతా: హైడ్రా కమిషనర్
రంగనాథ నగర్ ప్లాట్ ఓనర్ల సమస్యలు, ఫిర్యాదులు విన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారం, పది రోజుల్లో ఓనర్స్ సంఘాన్ని, స్థలం పొజిషన్ లో ఉన్న వారిని పిలిపించి మాట్లాడుతానని, వారి వద్ద, మీ వద్దనున్న డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత మీకు న్యాయం జరుగుతుందని ఆయన ప్లాట్ యజమానులకు హామీ ఇచ్చారు. మీ ఫిర్యాదును అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం చేస్తామని కమిషనర్ వ్యాఖ్యానించారు.
అంతకు ముందు కమిషనర్ మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. దేవాదాయ శాఖ ట్రస్ట్ భూములను ఆక్రమించి ఆ పక్కనే ఉన్న మా లే అవుట్ ను కబ్జా చేయడానికి మాజీ ఎమ్మెల్యే ప్రయతిస్తున్నారని శ్రీ మాత అరవింద కాలనీ వాసులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 33/10లో మొత్తం 13 ఎకరాలు ఉండగా, అందులో 7 ఎకరాలలో మాత అరవింద్ కాలనీ లే అవుట్ దశాబ్దాల క్రితం 444 ప్లాట్లతో ఏర్పడిందని, మా లేఔట్ పక్కనే మాజీ ఎమ్మెల్యేకు చెందిన స్థలం ఉండగా, మా లే అవుట్ దేవాదాయ శాఖ భూమి పరిధిలోకి వస్తుందంటూ, కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
Also read: kotpally project: కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు పూర్వవైభవం.. చిగురిస్తున్న రైతన్నల ఆశలు!
రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నాడని వాపోయారు. అదే ప్రాంతంలో బోడుప్పల్ విలేజ్ లో లే అవుట్ వికాస్ వెల్ఫేర్ కాలనీ లో 70 ప్లాట్లు ఉండగా, అందులో 35 ప్లాట్లు కలిగిన రాజకీయనాయకుడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి తమ ప్లాట్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆ లే అవుట్ లో రోడ్లు, పార్కులు లేకుండా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. అలాగే శ్మశానవాటిక స్థలం కూడా తనదేనంటూ ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టారని స్థానికులిచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు.
గోపన్నపల్లిలో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన దాదాపు 60 ఎకరాల భూమి లో ఫెన్సింగ్ వేయనియ్యడం లేదని, స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా, కమిషనర్ పరిశీలించారు. షేక్ పేటలోని ఓయూ కాలనీలో రోడ్ల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. ప్లాట్ ఓనర్లతో చర్చించి, సంబంధిత పత్రాలను సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.