HYDRA Commissioner: నాలా విస్తరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఉన్నామని, ఈ నెలాఖరు వరకు సాధ్యమైనంత మేరకు నాలా విస్తరణ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇటీవల ఆక్రమణలను తొలగించిన ప్యాట్నీ నాలా విస్తరణ పనుల తీరును కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, హైడ్రా ఇరిగేషన్, ట్రాఫిక్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు.
ఈ నెల 6న ప్యాట్నీ నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం విధితమే. వాస్తవంగా ఉండాల్సిన 20 మీటర్ల మేరకు నాల వెడల్పును విస్తరించటంతో పాటు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నాలాకు ఇరువైపులా 5 మీటర్ల బఫర్ కూడా ఉండేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు. నాలా విస్తరణ పనులు చేపట్టినందుకు స్థానికులు కమిషనర్‌ను అభినందించారు. దశాబ్దాలుగా వరద నీటి ప్రవాహాంలో మునిగిపోతున్నామని, ఈ సారి వరదముప్పు తప్పించేందుకు చేస్తున్న చర్యలకు పూర్తి సహకారం ఉంటుందని స్థానికులు కమిషనర్ కు తెలిపారు.
Also Read: KTR: సీడ్ కంపెనీల.. అక్రమాలను అడ్డుకోవాలని!
చికోటీ గార్డెన్స్‌లో నాలా పునరుద్ధరణ
ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ దగ్గర బేగంపేట విమానాశ్రయం నుంచి వచ్చే వరద నీటిని తీసుకెళ్లే కాలువ వాస్తవానికి 6 మీటర్లుండాలి. కానీ నాలాలపై వచ్చిన ఆక్రమణల కారణంగా ఎక్కడికక్కడే నాలా కుదించుకుపోయి కనీసం 2 మీటర్లు కూడా లేని పరిస్థితిని జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నందిని హోటల్ వద్ద మొత్తం 1.8 మీటర్లకే నాలా పరిమితమైనట్లు గుర్తించారు. కూకట్‌పల్లి ప్రధాన కాలువ కలిసే వరకు 2 కిలోమీటర్ల పొడవు ఈ నాలా ఉండగా, కిలోమీటరు మేర ఆక్రమణలకు గురైనట్టు నిర్ధారించారు.
ఈ నాలాను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. నాలా విస్తరణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అక్కడి స్థానికులు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. అపార్టుమెంట్ల మధ్యలోంచి వెళ్తున్న నాలా విస్తరణకు తమకేమీ అభ్యంతరం లేదని పలు అపార్టుమెంట్ల అసోసియేషన్లు కూడా తేల్చి చెప్పినట్లు తెలిసింది. కమిషనర్‌ను కలిసి ప్రతి ఏటా వరద ఉధృతి ఎలా ఉంటుందో? నాటి వీడియోలు చూపించారు. మోకాలు లోతు నీటిలో తాము ఇళ్లకు చేరాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న నాలాను 6 మీటర్ల మేర విస్తరిస్తే బేగంపేట ప్రధాన రహదారిపై నుంచి వచ్చే వరద నీరు సాఫీగా సాగేందుకు వీలు కలుగుతుందన్నారు.
చింతలబస్తీలోనూ...
శంకరపల్లిలోని బుల్కాపూర్, కొంపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 మీదుగా చింతలబస్తీలోకి ప్రవేశించి హుస్సేన్‌సాగర్‌లో కలిసే బుల్కాపూర్ నాలాను కూడా హైడ్రా కమిషనర్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. పింఛన్ ఆఫీసు దగ్గర చింతలబస్తీలోకి ప్రవేశించే చోట నాలాను కబ్జా చేసి దుకాణాలు నిర్మించడాన్ని తీవ్రంగా పరిగణించారు. వరద ఫ్లోకు అడ్డుకట్ట వేసే మాదిరి ఆక్రమించి ఇసుక, సిమెంట్ వ్యాపారాలు చేసుకోవడమేంటీ? అని ప్రశ్నించారు. ఇలా చింతలబస్తీలో పలు చోట్ల నాలా కబ్జాలను పరిశీలించారు. నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ నిర్మించడాన్ని చూసి, వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలాలో వరద నీరు సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. పేరుకుపోయిన చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు.
Also Read: Shaiva Group: రాబోయే మూడేళ్లలో.. 5020మందికి ఉపాధి!