KTR: రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలని కోరారు. సీడ్ కంపెనీల అక్రమాలతో మోసపోయిన గద్వాల జిల్లా రైతులు హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. సీడ్ కంపెనీలు చేసిన మోసంతో కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ కంపెనీలు నేరుగా తమకు విత్తనాలను ఇవ్వకుండా ఆర్గనైజర్లు అనే దళారులను నియమించుకొని మాఫియాగా వ్యవహరిస్తున్నాయని వివరించారు.
కొత్త మోసానికి తెరతీశాయి
ఈ సంవత్సరం తాము పండించిన సీడ్ ను గత సంవత్సరం కంటే తక్కువ ధరకు కొంటామని ఆర్గనైజర్లు, కంపెనీలు కొత్త మోసానికి తెరతీశాయని ఆరోపించారు. తాము పండించిన సీడ్ నాణ్యమైనది అయినప్పటికీ నాసిరకం అని, ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయిందని అబద్దాలు చెపుతూ తమ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కంపెనీలు తాము సొంతంగా పెట్టుకున్న గ్రో అవుట్ టెస్ట్ నిబంధనల ప్రకారం సీడ్ ను టెస్ట్ చేసి ఆ పంట ఫెయిల్ అయిందని చెపుతున్నారన్నారని, కానీ తాము పండించిన పత్తి విత్తనాలను ప్రయివేట్ ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తే పాస్ అయినట్టు తేలిందని వివరించారు. స్పందించిన కేటీఆర్ వెంటనే గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తో ఫోన్ లో మాట్లాడారు.
Also Read: Mahabubabad: పాఠశాలలో శానిటేషన్.. హెల్త్ ఎడ్యుకేషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి!
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సీడ్ కంపెనీల అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు. ఆయా కంపెనీలతో చర్చలు నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల కోసం తమ పార్టీ నేత విజయ్ కుమార్ కురువను ప్రత్యేకంగా పంపిస్తున్నానని కలెక్టర్ సంతోష్ కు తెలిపారు. తమ బాధ చెప్పుకున్న వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కేటీఆర్ కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావును, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్గనైజర్లు వడ్డీని వసూలు చేయోద్దు
ఆర్గనైజర్లతో కాకుండా ప్రభుత్వ వ్యవసాయ శాఖనుంచి సీడ్ కంపెనీలు రైతులకు విత్తనాలను పంపిణీ చేయాలని,రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను ధృవీకరించాలని, జిల్లాలోని సీడ్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసిన ప్రతి రైతు సీడ్ పత్తి విత్తనాలను ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్ లలోనే రీ శాంపిల్ చేపించి పరీక్షలు నిర్వహించి వాస్తవ ఫలితాలను రైతులకు ఇవ్వాలని అన్నారు.
సీడ్ కంపెనీలు రైతులకు పంట పెట్టుబడికి ఇచ్చిన మొత్తానికి ఆర్గనైజర్లు వడ్డీని వసూలు చేయోద్దని, గత సంవత్సరంలో ఏ రకంగా ఐతే ప్రతి ప్యాకెట్ కు ధర ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే ధరను చెల్లించాలని, సీడ్ పత్తి సాగు చేసే రైతులకు జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీలతో ఒప్పందం చేపించి రైతులకు గ్యారెంటీ ఇచ్చి నమ్మకం కల్పించాలని, డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ చేపించి మోసం చేసిన అన్ని సీడ్స్ కంపినీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయా కంపెనీలను నిషేధించాలని, రైతులకు రావాల్సిన పంట డబ్బులు ఇప్పించాలని, తెలంగాణలోని జిల్లాలలో సీడ్ ఉత్పత్తి జరిగే మండలాల్లో మండల వ్యవసాయ అధికారి దగ్గర సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీల, రైతుల వివరాలు ఉండాలని రైతులు కోరారు.
Also Read: Indiramma Housing Scheme: నిరుపేదలకి అందని.. ఇందిరమ్మ ఇండ్లు!