Hydra Ranganath: లే అవుట్ ల రూపాన్ని ఏ మాత్రం మార్చరాదని, మార్చితే చర్యలు తప్పవని హైడ్రా కమినర్ రంగనాథ్ అల్టిమేటం జారీ చేశారు. ఎవరికివారు, లే అవుట్ల రూపాన్ని మార్చే రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల్ని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందగా, లే ఔట్‌లలో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలపై చాలావరకు ఫిర్యాదులుండడంతో ఈ అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, గచ్చిబౌలిలోని సర్వే నంబరు 124, 125లో 20 ఎకరాల పరిధిలో ఫెర్టిలైజర్ కార్పోరేషన్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కాలనీ లే ఔట్ ఉంది. 162 ప్లాట్లు కాగా, రహదారులు, పార్కుల హద్దులు చెరిపేసి షెడ్డులు, నిర్మాణాలు చేపట్టి మొత్తం వాణిజ్య పరంగా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు వినియోగించుకుంటున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
తమ లే అవుట్ లోని ప్లాట్లు, రహదారులు చూపాలని, వాటిని పునరుద్ధరించాలని స్థానికులు అభ్యర్థించారు. రంగాగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఔట్‌లో కూడా రహదారులను ఆక్రమించి షెడ్డులు, నిర్మాణాలు నల్లమల్లారెడ్డి చేపట్టారని, కొంతమంది ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు.
తనకు అనుకూలంగా దివ్యానగర్ లేఔట్ ను మార్చుకుని ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారని వాపోయారు. 200ల ఎకరాల దివ్యానగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించి, రహదారుల్లో ఆంక్షలు లేకుండా చేసిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. 2 వేలకు పై ప్లాట్లున్న దివ్యానగర్ లే అవుట్ లో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన స్థలాన్ని తామిస్తామని అక్కడి భూ యజమానులు హనుమంతరెడ్డి, జైపాల్‌రెడ్డితో పాటు పలువురు స్థానికులు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
Also read: Bhudhan Land Case: భూదాన్ భూముల కేసులో దూకుడు పెంచిన ఈడీ.. త్వరలో వారికి నోటీసులు!
శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్, మసీదుబండ సీఎంసీ ఎన్‌క్లేవ్‌లో కూడా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ఆసిఫ్ పటేల్ అనే వ్యక్తి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఎన్‌క్లేవ్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
శేరిలింగంపల్లి మున్సిపాలిటీలోని తౌతానికుంటలో మట్టి నింపి, భగీరథమ్మ చెరువుకు వెళ్లే వరద కాలువలు మూసేయడంతో తమ నివాస ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తుతోందని గ్రీన్‌గ్రేస్ రెసిడెంట్స్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ గ్రామం సర్వే నంబరు 9, 10లోని పది ఎకరాల లే అవుట్ లో పార్కుకు ఎకరం స్థలాన్ని కేటాయించగా, ఇప్పుడు అక్కడ కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు.
ఇలా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులందడంతో గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీలలో గతంలో ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నది? ఆన్‌లైన్‌లో హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్‌గారు పరిశీలించారు. ఆ నిర్మాణాలకు అనుమతులున్నాయా?లేదా? అన్న విషయాలను వెంటనే పరిశీలించి వెంటనే వాటిని తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.