తెలంగాణ: Bhudhan Land Case: భూదాన్ భూముల కేసులో ఈడీ దూకుడు పెంచింది. వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు హైదరాబాద్ పాతబస్తీలోని యాఖుత్ పురా, మీర్ పేట ప్రాంతాల్లోని కొందరి ఇళ్లతోపాటు మొయినాబాద్ లో ఉన్న ఓ ఫార్మ్ హౌస్ పై దాడులు చేశారు. విస్తృత తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు భూదాన్ భూముల అమ్మకాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం. ఇక, భూదాన్ భూములను కొన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వరుసగా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది.
ఇప్పటికే భూదాన్ భూముల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చటానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియచేయాలంటూ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రస్తుతం బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిర్ షరీఫ్ అనే వ్యక్తి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించటం ద్వారా సేల్ డీడ్లు చేయించుకున్నారంటూ గత యేడాది మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!
ఈ మేరకు పోలీసులు ఖదీరున్నీసా, మహ్మద్ మునవర్ ఖాన్, అప్పటి మహేశ్వరం ఎమ్మార్వో/సబ్ రిజిస్ట్రార్ ఆర్.పీ.జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్.సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ కేసులోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ ను గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించారు.
తాజాగా ఇ రోజు సీఆర్పీఎఫ్ పోలీసుల బందోబస్తుతో యాఖుత్ పురా, మీర్ పేట తదితర ప్రాంతాల్లో ఉన్న ఖదీరున్నీసా, మహ్మద్ మునవర్ ఖాన్, షర్ఫాన్, ఎం.ఏ.సుకూర్ తదితరుల ఇళ్లపై దాడి జరిపారు. మొయినాబాద్ లో ఉన్న మహ్మద్ మునవర్ ఖాన్ కు చెందిన ఫార్మ్ హౌస్ లో కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భూదాన్ భూముల సేల్ డీడ్స్ కు సంబంధించి పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలియవచ్చింది.
ఇప్పటికే హైకోర్టు సీరియస్..
కాగా, నాగారం గ్రామం సర్వే నెంబర్లు 181, 182, 194, 195లలో భూదాన్ భూములకు సంబంధించి మహేశ్వరం మండలానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ భూములను తమ పేర…తమ కుటుంబ సభ్యుల పేర రిజిష్టర్ చేయించుకున్నారంటూ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
దీని కోసం రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని తెలిపాడు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి పట్టాదారు పాస్ బుక్కులు కూడా తీసుకున్నట్టు పేర్కొన్నాడు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Silver Jubilee Celebrations: సిల్వర్ జూబ్లీ వేడుకలు.. కానరాని పెద్ద సార్!
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూములన విక్రయించటం, బదిలీ చేయటం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లో ఉన్న అధికారులని వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అదే సమయంలో భూదాన్ భూముల వ్యవహారంలో అసలేం జరిగిందన్నది తేల్చటానికి విచారణ జరపటానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియ చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో భూదాన్ భూముల అంశంలో త్వరలోనే సీబీఐ విచారణ మొదలు పెట్టవచ్చన్న అభిప్రాయం అధికారవర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈడీ ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో దాడులు చేయటం ప్రస్తుతం అధికారవర్గాల్లో చర్చనీయంగా మారింది. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఈ భూములను కొన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని భావిస్తుండటంతో బ్యూరోకాట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.