Hydra Commissioner: నగరంలో చెరువుల పరిరక్షణతో పాటు వివిధ రకాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువులకు పట్టిన మురుగును వదిలించడంతో పాటు ఆ పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా హైడ్రా పూర్తి స్థాయిలో పని చేస్తోందని వివరించారు. నగరంలో చెరువుల కబ్జాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సైదాబాద్ లోని ఎర్రకుంట చెరువుతో పాటు రామంతాపూర్ లోని చిన్న చెరువును హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఏవీ రంగనాథ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నగరంలో చెరువులు కబ్జా కాకుండా ఫెన్సింగ్ వేయడంతో పాటు వాటి రూపు రేఖలను మార్చుతామన్నారు.
పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం
హైడ్రా తొలి విడతా చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణలో ఇప్పటికే బతుకమ్మకుంటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. మరో 5 చెరువులు త్వరలోనే ప్రారంభానికి సిద్ధమౌతున్నాయన్నారు. అదే మాదిరి సైదాబాద్ లోని ఎర్రకుంట చెరువును కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. 6 ఎకరాలకు పైగా ఉన్న చెరువుకు హైడ్రాలిక్ ఫ్యూచర్స్ అన్ని ఉన్నాయని తెలిపారు. కొంతమంది ఈ చెరువు తమదిగా చెబుతున్నారని, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ ఆర్ ఎస్ సీ( నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) మ్యాప్ లు, శాటిలైట్ చిత్రాలు, గ్రామ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కడా ఎలాంటి వివాదానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా చెరువుల అభివృధిని చేపడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎర్రకుంట అభివృద్ధితో పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదంగా మారుతాయని చెప్పారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డితో పాటు పలువురు ఈ సందర్భంగా కమిషనర్ను కలిసి చెరువును అభివృద్ధి చేయాలని వినతిపత్రాలు అందజేశారు.
Also Read: HYDRA Commissioner: ప్రజావసరాల స్థలాలను కాపాడుతున్నాం.. రంగనాథ్ స్పష్టం!
రామంతాపూర్ చెరువు ను ఆహ్లాదకరంగా మారుస్తాం
రామంతాపూర్ చిన్న చెరువు రూపురేఖలు మార్చి, ఆహ్లాదకరంగా మారుస్తామని సర్కారుకు నివేదికలు పంపి వెంటనే పనులు ప్రారంభిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్కడి స్థానికులకు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీ వాణి హైడ్రా కమిషనర్ను కలిసి చెరువును అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ఈ చెరువులు వరద కట్టడికి ఎంతో దోహదపడతాయని, ముఖ్యంగా మూసీ నదికి ఆనుకుని ఉన్న చెరువులను రక్షించుకుంటే వరదలను చాలా వరకు నియంత్రించవచ్చునన్నారు.
వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం
నగరంలో దక్షిణ, తూర్పు భాగంలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెరువుల అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు. రామంతాపూర్ చిన్న చెరువు చుట్టూ అనేక నివాస ప్రాంతాలున్నాయని, భూగర్భజలాలు కూడా కలుషితంగా మారాయని, ఈ నేపథ్యంలో ఈ చెరువు అభివృద్ధిని వెంటనే చేపడతామన్నారు. చెరువులో పూడికను పూర్తి స్థాయిలో తొలగించి మంచి నీరు చేరేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వాకింగ్ ట్రాక్ లు, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్ లు, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చెరువులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రంగనాధ్ వ్యాఖ్యానించారు.
Also Read: HYDRA Commissioner: నాలాల్లో చెత్త వేసే చర్యలు తీసుకుంటాం.. హైడ్రా కమిషనర్ ఆదేశం!

