హైదరాబాద్: AV Ranganath on ORR: లే ఔట్లతో పాటు పలు నివాస ప్రాంతాల్లో రహదారులకు ఆటంకాలు సృష్టించవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తలిపారు. ఒక వేళ ఎక్కడైనా ఉంటే వెంటనే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. ఓఆర్ ఆర్ పరిధిలో ఎక్కడా రహదారుల్లో ఆటంకాలు లేకుండా హైడ్రా చూస్తుందని భరోసా ఇచ్చారు. పార్కులు, పాఠశాలలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రాథమిక ఆసుపత్రులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలును అందుకోసమే ఉపయోగపడేలా చూడాలని ఆయన సూచించారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే వాటిని తొలగించి ప్రజలకు అందజేస్తామన్నారు.
రహదారులకు అడ్డంగా గోడలు కట్టి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కూడా బై నంబరు జోడించి కాజేసేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. మొత్తం 52 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయి. లే ఔట్లలో ప్లాట్ల నుంచి సర్వే నంబర్ల వరకూ బై నంబర్లు వేసి ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములను కాజేస్తున్నవారి పట్ల అధికారులు కఠినంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
వెంటనే విచారణ చేపట్టి రహదారులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ సూచించారు. చుట్టూ ఇళ్లున్నా మధ్యలో తమకున్న స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వడంలేదని, చెరువుల ఎఫ్‌టీఎల్ పేరుతో అనుముతులు మంజూరు చేయడంలేదని పలువురు హైడ్రాకు ఫిర్యాదుచేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ కూడా త్వరలో పూర్తవుతుందని కమిషనర్ చెప్పారు.
ఫిర్యాదులు ఇలా:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట గ్రామంలో సర్వే నంబరు 345లో గల స్థానిక మాజీ ప్రజాప్రతినిధి 25 గుంటల ప్రభుత్వ స్థలంలో అతిథిగృహం నిర్మించి అక్కడ స్థానికులకు ఇబ్బందిగా మారారు. ఇదే వ్యక్తి సర్వే నంబరు 14లో కూడా 36 గుంటల ప్రభుత్వ స్థలానికి బై నంబరు వేసి ఆక్రమించుకున్నారని స్థానికంగా ఉన్నయువకులు ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్ ఫిరోజ్‌గూడలోని మాధవి నగర్ పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారని దీనిపై తాము కోర్టుకు వెళ్లగా స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రయోజనం లేకపోయిందని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదుచేశారు.
కోర్టు తీర్పును అమలుచేయకుండా నిర్మాణాలు చేపట్టారని అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. 300ల గజాల స్థలాన్ని పార్కు నిర్మాణానికి స్వాధీనం చేసుకోవాలని హైడ్రాను కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజల్‌లో కూడా ప్రజలు వినియోగించే రహదారులకు కబ్జాదారులు ఆటంకాలు సృష్టించారని ఫిర్యాదుచేశారు. మరియు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రాజేంద్రనగర్ వేంకటేశ్వర కాలనీకి 60 ఫీట్ల రోడ్డు ఉండగా దానికి అడ్డంగా ప్రహరీ నిర్మించేశారని అక్కడే సర్వేనంబరు 20లో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాచేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
Also Read: MP Chamala Kiran: కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడు.. ఎంపి చామల సంచల కామెంట్స్
సరూర్‌నగర్ చెరువుకు చేరువలో తమకు ఇంటి స్థలం ఉందని తమ స్థలానికి చుట్టూ ఇల్లున్నా తాము ఇంటిని నిర్మించుకోడానికి ఎఫ్‌టీఎల్ అంటూ అనుమతులు మంజూరు చేయడంలేదని కోటీశ్వరరావు అనే వ్యక్తి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెరువుకు వెంటనే ఎప్‌టీఎల్ నిర్ధారించాలని ఆయన కోరారు. ఇదే పరిస్థితి రావిర్యాల పెద్దచెరువులో కూడా నీటి నిలువలు పెరిగి తమ ప్లాట్లు మునిగిపోతున్నాయని పలువురు ఫిర్యాదుచేశారు.