Hyderabad Task Force: రద్దయిన కరెన్సీ నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నించిన గ్యాంగును ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు నారాయణగూడ పోలీసుల(Narayanguda police)తో కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.92కోట్ల విలువ చేసే 500, 1000 రూపాయల నోట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ముల్లా అబ్బాస్ అలీ (46) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. పని చేస్తున్న సమయంలో కొంతమంది రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను ఇప్పటికీ కొంటున్నట్టుగా అతనికి తెలిసింది. కోటీ రూపాయల రద్దయిన కరెన్సీకి 30 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా తెలియవచ్చింది.
Also Read: Collector Rizwan Basha: సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
1.92కోట్ల రూపాయల రద్దయిన కరెన్సీ
దాంతో తేలికగా డబ్బు సంపాదించ వచ్చని భావించిన ముల్లా అబ్బాస్ అలీ బెంగళూరులో రద్దయిన కరెన్సీని మార్చటానికి ప్రయత్నించి పరప్పణ అగ్రహార పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు. బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన తరువాత తనకు తెలిసిన వారి నుంచి 1.92కోట్ల రూపాయల రద్దయిన కరెన్సీ నోట్లను తీసుకున్నాడు. ఆ తరువాత సహచరుడైన ఒడిషా వాసి లడ్డూతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. తంగెళ్ల కృష్ణమోహన్ తో కలిసి వాటిని మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ క్రమంలో మన్నెల్లి రాజ్ కుమార్, యాద జయకవిత గుప్తాలు 1.92కోట్ల రద్దయిన కరెన్సీ నోట్లను 30లక్షల రూపాయలు ఇచ్చి తీసుకోవటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరెన్సీని మార్చుకునేందుకు నారాయణగూడ శాంతి థియేటర్ ప్రాంతానికి వచ్చారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ నాగార్జున, ఎస్ఐ కరుణాకర్ రెడ్డితోపాటు నారాయణగూడ పోలీసులతో కలిసి నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లడ్డూ కోసం గాలిస్తున్నారు.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి.. జై కొట్టిన కవిత