AV Ranganath: వరద ముప్పు లేని హైదరాబాద్ నగర సాధనే అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) అన్నారు. జీహెచ్ ఎంసీ మెయింటినెన్స్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నుంచి ప్రారంభంకానున్న డీసిల్టింగ్ పనుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం, హైడ్రా అధికారులతో హైడ్రా కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్‌లో హైడ్రా కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యాయని తెలిపారు. క్యాచ్ పిట్లు, కల్వర్టులలో సిల్ట్ ను తొలగించేదే హైడ్రా పని అయినప్పటికీ, ప్రధాన నాలాల్లో పూడికను కూడా తొలగించామని చెప్పారు. ఈ వర్షాకాలంలో అనుభవంలోకి వచ్చిన సమస్యలు ఎన్నో పాఠాలు నేర్పాయని, వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఇవన్నీ దోహదపడుతాయన్నారు. డీసిల్టింగ్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, వరద నీరు సాఫీగా సాగడానికి హైడ్రా అన్ని విభాగాలకు సహకారాన్ని అందిస్తుందని కమిషనర్ క్లారిటీ ఇచ్చారు.
స్థానికుల భాగస్వామ్యంతో
నాలాల్లో డీసిల్టింగ్ పనులను జనవరి నుంచే మొదలు పెట్టనున్నట్లు, వీటి పర్యవేక్షణలో స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు పడతారన్నారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. టోలీచౌకి, గౌరిశంకర్ నగర్ కాలనీ నాలాల్లో పూడిక తీసినప్పుడు వారం, పది రోజుల ఇబ్బందులు పడినా పూర్తి సహకారం అందించారన్నారు. ఇదే పరిస్థితి పాతబస్తీ యాఖుత్ పురాలో కూడా స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజల నుంచి సహకారం అందిందని కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్‌లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!
ఖచ్చితంగా నాలాల్లో పూడిక తీయాల్సిందే
నాలాల్లో పూడిక తీసే పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా ఖచ్చితంగా పూడిక తీయాల్సిందేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇది తమ పరిధిలోకి రాదని, ఇంత పూడికను మేము తీయమని కాంట్రాక్టర్లు అనడానికి వీల్లేకుండా పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అమీర్ పేట లోని మైత్రివనం వద్ద పూడుకుపోయిన భూగర్భ డ్రైనేజీ లైన్లను క్లియర్ చేయడం, సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నాలాపై ఉన్న ఆక్రమణలు తొలగించి విస్తరించడంతో ఆ రెండు ప్రాంతాల్లో వరద ముప్పు లేకుండా చేసిన విషయాన్ని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకరిద్దరి సమస్యకంటే వందలు, వేలాది మంది సమస్య పరిష్కారమే లక్ష్యంగా పని చేయాల్సి ఉందన్నారు.
ముఖ్యంగా నాలాల్లో పూడికను తొలగించడం ఎంత ముఖ్యమో, వాటి నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందన్నారు. హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, ఎస్ ఎన్ డీపీ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ జ్యోతిర్మయితో పాటు పలువురు జీహెచ్ ఎంసీ ఇంజనీర్లు, హైడ్రా ఆర్ ఎఫ్ వో జయప్రకాష్, డీఎఫ్ వోలు, ఎస్ ఎఫ్ వోలు, హైడ్రా అసెట్ ప్రొటెక్షన్ ఇన్ స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొని స్థానికంగా తలెత్తిన సమస్యలను వివరించారు.
Also Read: AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

