VC Sajjanar: విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన డ్యూటీలో తప్పులు చేసినా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar )హెచ్చరించారు. అంకితభావంతో నిజాయితీగా పనిచేసే వారిని ప్రశంసిస్తామన్నారు. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ తోపాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. సిబ్బందే పోలీసు శాఖకు వెన్నుముక అని చెప్పారు. ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. అందే ఫిర్యాదులపై సత్వర విచారణ జరిపి బాధితులకు న్యాయం ఇప్పించినపుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం, గౌరవం పెరుగుతాయన్నారు. మన ప్రవర్తనే డిపార్ట్ మెంట్ ఇమేజ్ ను నిర్ణయిస్తుందని చెప్పారు. వృత్తి నైపుణ్యం, ప్రామాణిక కార్యాచరణ విధానాలను పాటిస్తూ డ్యూటీలు చేయాలన్నారు.
Also Read: VC Sajjanar: కొంతమంది అలా డ్రైవింగ్ చేస్తున్నారు.. ఊరుకోబోం.. హైదరాబాదీలకు సజ్జనార్ వార్నింగ్
ఎక్స్ ట్రా మై రివార్డ్
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే సిబ్బందిని ప్రోత్సహించేందుకు త్వరలోనే ఎక్స్ ట్రా మైల్ రివార్డు విధానాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీంట్లో భాగంగా ప్రతీ సిబ్బంది పనితీరును సమీక్షించి విధుల్లో ప్రతిభ చూపించిన సిబ్బందికి ప్రశంసా పత్రం, నగదు రివార్డు ఇస్తామన్నారు. ప్రజలతో సమన్వయం కుదుర్చుకున్నపుడే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం సులువు అవుతుందని చెప్పారు. ఈ దిశగా అందరూ కృషి చేయాలన్నారు.
డ్రగ్స్ పై ఉక్కుపాదం
తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కమిషనర్ సజ్జనార్ గుర్తు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చటానికి కృషి చేయాలని సూచించారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. మాదక ద్రవ్యాల దందా చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. కేసులు నమోదు చేసి వదిలేయకుండా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన ఛార్జిషీట్లను తయారు చేసి ఆయా కోర్టులకు సమర్పించాలన్నారు.
మహిళలు చిన్నపిల్లలు
మహిళలు, చిన్న పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ చెప్పారు. వీరి పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సరే మహిళలు, పిల్లల పట్ల నేరానికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి తీసుకు రావాలన్నారు. దీని కోసం కమిషనరేట్ అని అన్ని విభాగాల పోలీసులతోపాటు షీ టీమ్స్ పని చేయాలని చెప్పారు. ఇక, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టటానికి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టాలన్నారు. మెరుగైన పోలీసింగ్ కోసం సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే తనకు నేరుగా తెలియ చేయవచ్చన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను, వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ కేసులను పరిష్కరించాలని చెప్పారు. ఇక, పని ఒత్తిడి కారణంగా సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ప్రశంసలు
ఇటీవల మాదన్నపేట స్టేషన్ పరిధిలో హత్యకు గురైన ఏడేళ్ల బాలిక సుమయా కేసులో నిందితులను 48గంటల్లోనే అరెస్ట్ చేసిన ఎస్ఐలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్ తోపాటు సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక, నిరాశ్రయులైన పలువురిని ఆదరించి అమ్మానాన్న ఆశ్రమానికి తరలిస్తున్న అఫ్జల్ గంజ్ సీఐ రవి, అడ్మిన్ ఎస్ఐ నిరంజన్, ఏఎస్ఐ ధర్మేందర్ లకు అభినందనలు తెలిపారు. 30 ఏళ్లుగా చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితున్ని అరెస్ట్ చేసిన ఫిలింనగర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ విజయ్ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ లను కూడా అభినందించారు.
దేశంలోనే అతి పురాతనమైన, పేరున్న హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయటానికి ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పని చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్భాల్, జాయింట్ కమిషనర్ (అడ్మిన్) పరిమళ హనా నూతన్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వ రావు, హెడ్ క్వార్టర్ప్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదనపు సీపీ (క్రైమ్) ఎం.శ్రీనివాసులు, జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, కమిషనరేట్ లోని అన్ని జోన్ల డీసీపీలతోపాటు సిబ్బంది అంతా వర్చువల్ గా మీటింగ్ కు హాజరయ్యారు.
Also Read: VC Sajjanar on SC Classification: ఆర్టీసీ ఉద్యోగాల భర్తీలో ఆ చట్టాన్ని అమలు చేస్తాం.. వీసీ సజ్జనార్
