తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: VC Sajjanar on SC Classification: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఇటీవల 3038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణను ఈ నియమాయాల్లో సంస్థ అమలు చేస్తుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలను హైదరాబాద్ లోని కళా భవన్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంస్థలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామన్నారు.
అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలని పిలుపు నిచ్చారు. కులం, మతం, లింగ బేధం లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలుండాలని అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. బలహీన వర్గాలకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు.
Also Read: Kancha Gachibowli Land: ఆ భూములపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం.. నిపుణులతో చర్చలు..
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం పరిశీలిస్తోందని, కొందరు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్ నర్మద, సీపీఎం ఉషాదేవి, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘ నాయకులు రాజయ్య నాయక్, గడ్డం శ్రీనివాస్, సుభాష్, యాదయ్య, కృష్ణ, చంద్రకళ, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు బస్ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్ నర్మద, సీపీఎం ఉషాదేవి, సీటీఎంలు శ్రీదేవి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/