C-Mitra: సైబర్ క్రైమ్ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు అమల్లోకి తెచ్చిన ‘సీ-మిత్ర’ సత్పలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం మొదలైన పది రోజుల్లోనే వందల మందికి భరోసా నిచ్చింది. సీ-మిత్ర బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే సీ మిత్ర సిబ్బంది వందకు పైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇంటి నుంచే ఫిర్యాదు..
సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే ‘సీ-మిత్ర’ బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.
‘పోలీసులా కాదు.. ఒక సోదరిలా’
సీ-మిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేసింది. రెండు షిప్ట్ ల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ బాధితులకు అందుబాటులో ఉంటోంది. ‘సాధారణంగా మోసపోయామన్న బాధలో ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే భయపడతారు. కానీ, మేమే స్వయంగా ఫోన్ చేసి భయపడకండి, మీకు న్యాయం చేయడానికి మేమున్నాం’ అని చెప్పగానే వారి గొంతులో ధైర్యం వినిపిస్తోంది. స్టేషన్ కు రావాలంటే ఆలోచించే సామాన్యుడికి, పోలీసులకు మధ్య సీ-మిత్ర ఒక బలమైన వారధిలా పని చేస్తోంది. నేను ప్రతి రోజు 20 మంది బాధితులకు ఫోన్ చేస్తా. ఒక సోదరిలా వారి సమస్యను విని, ఇంటి నుంచే ఫిర్యాదు తీసుకుంటున్నప్పుడు బాధితులు చూపిస్తున్న కృతజ్ఞత మా బాధ్యతను మరింత పెంచుతోంది. భవిష్యత్తులో సీ-మిత్ర అవసరం ఉండొద్దు’ అని మహిళా కానిస్టేబుల్ దీక్షితా అన్నారు.
Also Read: DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!
‘సీ-మిత్రతో ఆ ఇబ్బందులు లేవు’
‘టెక్నాలజీని, మానవతా దృక్పథాన్ని జోడించి హైదరాబాద్ పోలీస్ సృష్టించిన ఈ డిజిటల్ విప్లవంలో ప్రజలకు వేగంగా సేవలందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గతంలో సైబర్ మోసం జరిగితే.. ఫిర్యాదు ఎలా రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అని తెలియక బాధితులు సతమతమయ్యేవారు. కానీ సీ-మిత్రతో ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. బాధితుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫోన్ చేసి వివరాలు అడగానే సానుకూలంగా స్పందించి.. అన్ని వివరాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ లో ఒక్క సైబర్ బాధితుడు కూడా లేకుండా చేసి సీ-మిత్ర అవసరం రాకుండా చెయ్యాలన్నదే మా లక్ష్యం’ అని మరో మహిళా కానిస్టేబుల్ పృథ్వీక చెప్పుకొచ్చారు.
సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర'
పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్
200 ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసిన వర్చువల్ పోలీసులు
ఇప్పటివరకు 100 ఎఫ్ఐఆర్ల నమోదు
సీ-మిత్ర పనితీరుపై బాధితుల హర్షం
సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన… pic.twitter.com/d1g6IWP2Pq
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2026

