Kaleshwaram Project Case: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఫిబ్రవరి 25 వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శి సీ.ఎస్.కే. జోషి, ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ పై సైతం ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని సూచించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వారందరికీ కాస్త ఉపశమనం లభించినట్లైంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ .. కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు జోషి, స్మిత సబర్వాల్ తోపాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమ వాదనలు వినకుండా కమిషన్ ఏక పక్షంగా నివేదిక ఇచ్చిందంటూ కేసీఆర్ తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టి వేయాలని కోరారు.
Also Read: Eco Park Scam: ఎక్స్ పీరియం ఎకో పార్క్ యజమాని ఘరానా మోసం.. లీజు పేరుతో లాగేసుకున్న పేదల భూమి..?
ఆయా పిటిషన్లపై ప్రస్తుతం హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేసింది. వీటికి పిటిషనర్లు రిప్లై ఇచ్చారు. అయితే, వీటిపై ప్రభుత్వం తరపున లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఫిబ్రవరి 20 లోపు లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25 కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

