Hydraa: వర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్రమణలపై హైడ్రా(Hydraa)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఉన్న నాలాలు కబ్జాకు గురికావటం, వరద కాలువలన్నీ ఎక్కడో ఒక దగ్గర ఆక్రమణలకు గురై వరద నీరు తమ నివాసాలను ముంచెత్తుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్యాచ్‌మెంట్ ఏరియా ఎంత ఉంది? నాలా ఎంత వెడల్పులో ఉంటే సరిపోతుంది? అనే విషయాన్ని అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు సర్వే నంబరు ఒకటి చూపించి మరో చోట ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని, పార్కులు, ప్రజావసరాలకు ఆద్దేశించిన స్థలాలు కబ్జా చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదులు సమర్పించారు. ఇలా హైడ్రా ప్రజావాణికి సోమవారం వచ్చిన 26 ఫిర్యాదుల్లో ఎక్కువ నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపైనే ఉన్నట్లు, ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్(N Ashok Kumar) పరిశీలించి పరిష్కారం నిమిత్తం అధికారులకు అప్పగించారు.
ఫిర్యాదులిలా..
కూకట్‌పల్లి(Kukatpally) మున్సిపాలిటీ, హైదర్‌నగర్ డివిజన్ రామ్‌నరేష్ నగర్‌కాలనీ వరద నీటి కాలువ ద్వారా వర్షపు నీరు సాఫీగా అలీతలాబ్ చెరువులోకి చేరుతుండేది. కాని ఈ నాలా ఎక్కడికక్కడ కబ్జాకు గురికావటంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలను ముంచెత్తుతోందని రామ్ నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ ఆసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కుండపోత వర్షాల వేళ ఉన్న నాలాలు సరిపోని పరిస్థితి ఉండగా, అవి కూడా కబ్జాకు గురికావటం బాధాకరమని, ప్రభుత్వం సరైన విధానంతో ఆక్రమణలను తొలగించాలని అసోషియేషన్ ప్రతినిధులు కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం రేణుక ఎల్లమ్మ కాలనీలో 1600ల గజాల పార్కు స్థలంతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన 800 గజాల స్థలం కబ్జాకు గురి అవుతోందని స్థానికంగా అధికారులకు పిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, హైడ్రా అధికారులు జోక్యం చేసుకుని ఆ స్థలాలను కాపాడాలని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు పిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని అంజయ్యనగర్‌లో ఉన్న పార్కును కాపాడినందుకు హైడ్రాకు అక్కడి నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: HCA Fund Misuse: హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని జగన్ మోహన్ రావు.. వెలుగులోకి మరో సంచలనం..?
స్థానిక అధికారులు కాలయాపన
గతంలో ఈ పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు జీహెచ్ఎంసీ(GHMC) కేటాయించిందని, పనులు చేపడితే కొంతమంది అడ్డుకోవడం జరిగినట్లు వివరించారు. దీంతో పనులు ఆపేసి వెళ్లిపోయిన జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పుడు కబ్జాలు తొలగినా పార్కు అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన రూ. 50 లక్షల కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపామని, జీహెచ్ ఎంసీ స్థానిక అధికారులు కాలయాపన చేస్తున్నారని, దీంతో పార్కు ఉండి ప్రయోజనం లేకుండా పోయిందని ఫిర్యాదుదారులు వాపోయారు. ఉప్పల్ మండలం బండ్లగూడ నాగోల్ సర్వే నంబరు 36/6 లో ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 35/5 ను చూపించి అనుమతులు తెచ్చుకుని 36/6 లోని 3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికారులకు ఈ విషయం తెలిసినా చర్యలు తీసుకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి హైడ్రా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
Also Read: KTR: అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ సభలు!.. నేతల తయారీకి సూపర్ ప్లాన్..?
