Hydra Commissioner: సిటీలో పది సెంటీమీటర్ల వర్షం పడితే చాలు నగరమంతా పరేషానే. రహదారులన్నీ జలమయమవుతాయి. ఇక అమీర్‌పేట ప్రాంతంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారువుతుంది. జూబ్లీహిల్స్, గాయత్రీ హిల్స్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మదురానగర్, శ్రీనివాస నగర్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ముందుకు సాగక అమీర్‌పేటలో నడుం లోతు నీళ్లు ప్రధాన రహదారిపై నిలిచిపోవడం, గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తటం, వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.
ఇవన్నీ నగరవాసులకు ప్రతి ఏటా వానాకాలం ఎదర్కొనే కష్టాలే. ఈ ఏడాది ఆ సమస్యకు హైడ్రా (Hydra) పరిష్కారం చూపింది. వరద కష్టాలకు తెర దించింది. ఇప్పుడు 10 సెంటీమీటర్ల వర్షం పడితే నీరు నిలవకుండా ముందుకు సాగేలా హైడ్రా చర్యలు తీసుకుంది. ఈ పనులను హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఏవీ రంగనాథ్ (AV Ranganath) నిరంతరం పర్యవేక్షించారు. హైడ్రా, జీహెచ్ ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎట్టకేలకు పరిష్కారాన్ని చూపారు. ఈ క్రమంలోనే గురువారం కూడా అమీర్‌పేటలో పర్యటించి పూడుకుపోయిన నాలాల నుంచి మట్టిని, చెత్తను తొలగించే పనులను పర్యవేక్షించారు.
Also Read: Hydraa Commissioner: ట్రాఫిక్ పోలీసులతో హైడ్రా ప్రత్యేక సమావేశం
అమీర్‌పేట విధానం ఓ నమూనా
అమీర్‌పేటలో వరద ముప్పు తప్పించేందుకు అనుసరించిన విధానం నగరంలోని అనేక ముంపు ప్రాంతాలకు పరిష్కార మార్గమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పూడుకుపోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా ప్రాంతాల్లో వరకు వరద సమస్యకు చెక్ పెట్టవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్ ప్రాంతాలను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం 6 పైపులైన్లుండగా, 3 లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. మరో 3 లైన్లలో పూడిక తీయడంతో ఈ వరదంతా గాయత్రీనగర్‌పై పడకుండా అక్కడ కూడా పైపులైన్లలో మట్టిని తొలగించే పనిని పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. వచ్చే వర్షా కాలానికి నీరు నిల‌్వకుండా గాయత్రీ నగర్ కు ముంపు సమస్య లేకుండా చూడాలన్నారు.
45 ట్రక్కుల మట్టి తరలింపు
అమీర్‌పేట జంక్షన్‌లో సారథి స్టూడియోస్, మధురానగర్ వైపు నుంచి వచ్చే పైపులైన్లు కలుస్తాయి. ఎగువ నుంచి వరదతో పాటు భారీ మొత్తంలో చెత్త కూడా ఇక్కడకు చేరుతోంది. అలా దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్‌పేట జంక్షన్‌లో 6 పైపులైన్లు పూడ్చుకుపోయి కొంత మొత్తంలోనే వరద నీరు ముందుకు ప్రవహించేది. ఏమాత్రం వర్షం పడినా వరద ముంచెత్తేది. శ్రీనివాస్‌నగర్ వెస్ట్ సైడ్ వరద కాలువ పైన కాంక్రీట్‌తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. పరుపులు, దిండులు ఇలా చెత్తతో మూసుకుపోయిన పైపులైన్లను తెరిపించింది. ఇప్పటి వరకూ ఇలా 45 ట్రక్కుల మట్టిని తొలగించింది.
దీంతో ఈ ఏడాది 10 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది కలగలేదు. మరో 3 పైపు లైన్లలో కూడా పూడికను తొలగిస్తే 15 సెంటీమీటర్ల వర్షం పడినా అమీర్‌పేటలో వరద ముంచెత్తదని హైడ్రా, జీహెచ్ ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్‌గ్రౌండ్ పైపు లైన్లలో పూడికను తొలగించి ముంపు సమస్యను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అమీర్ పేటలో ముంపు సమస్యకు హైడ్రా పరిష్కారం చూపటంతో కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా కు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Hydra: బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
