Drunk And Drive: హైదరాబాద్ నగరంలో వరుసగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో ఏకంగా 959 మంది మందుబాబులు పట్టుబడ్డారు.
కమిషనరేట్ల వారీగా..
హైదరాబాద్ 535 మంది ద్విచక్ర వాహనదారులు 430, కార్ల డ్రైవర్లు 66 ఆటో డ్రైవర్లు 39 పట్టుబడ్డారు. సైబరాబాద్‌లో 424 మంది ద్విచక్ర వాహనదారులు 300 కార్ల డ్రైవర్లు 99 ఆటో డ్రైవర్లు 18 భారీ వాహనదారులు 7 గురు పట్టుబడ్డారు. మొత్తం 959 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయా కోర్టుల్లో హాజరుపరచనున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ… పరిమితికి మించి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని పునరుద్ఘాటించారు. మత్తులో డ్రైవింగ్ చేసి ఏదైనా ప్రమాదానికి కారణమైతే, బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమీసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.

