Hydraa: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ‘హైడ్రా’ ఇంత తక్కువ కాలంలో, అంతటి ప్రజాభిమానాన్ని చురగొనడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నాయంటే అడ్డుకునే శక్తిగా, దశాబ్దాల తరబడి పరిష్కారం కాని పనులను గంటల వ్యవధిలో పూర్తి చేసే సంకల్పంగా నిలిచిన హైడ్రా(Hydraa)కు ఇప్పుడు నగరం నీరాజనం పలుకుతోంది. కొందరు స్వార్థపరులు, కబ్జాదారులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాలనీవాసులు, సామాన్య ప్రజలు తిప్పి కొడుతూ హైడ్రా జిందాబాద్ అంటూ నినదిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సర్కారు ఆస్తులను కాపాడుతూ, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రాపై కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని కాలనీ, బస్తీవాసులు తిప్పి కొడుతున్నారు. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజానీకం గొంతుగా మారిన హైడ్రాకు నగర ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. హైడ్రా వల్ల దశాబ్దాలుగా పరిష్కారం లేని తమ సమస్యలు తీరాయని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తూ, తమకు జరిగిన మేలును వివరిస్తున్నారు. ప్లకార్డులు చేతబూని హైడ్రా పనులకు నీరాజనం పలుకుతున్నారు.
నగరానికి హైడ్రానే ఆధారం
మంగళవారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వద్ద వాకింగ్ చేసిన వారు హైడ్రా పనులను అభినందించగా, మణికొండ(Manikonda) మర్రి చెట్టు వద్ద దాదాపు 15 కాలనీలకు చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలో రూ. వెయ్యి కోట్లకు పైగా విలువైన పార్కులను కాపాడి నగర ప్రజలకు ప్రాణవాయువును అందించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో స్థానికులు మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలోనూ ప్రజావసరాలకు ఉద్దేశించిన 4300 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు వరద కష్టాలు తీర్చింది హైడ్రానేనని పలు కాలనీల ప్రజలు నినదిస్తున్నారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినా, వరద కష్టాలు లేకుండా చేసింది హైడ్రానేనని వారు పేర్కొన్నారు. దశాబ్దకాలంగా పేరుకుపోయిన పూడికను నాలాల నుంచి తొలగించడంతో వరద నీరు సాఫీగా సాగిందన్న విషయాన్ని స్థానికులు గుర్తు చేశారు. ప్రాణవాయువును అందించే పార్కులను పరిరక్షించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన హైడ్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కబ్జాదారుల విధ్వంసం ఆగాలంటే హైడ్రా ఉండాల్సిందే, ఆపద ఏదైన హైడ్రా ఆపన్న హస్తం అంటూ చిన్నా పెద్దా కొనియాడారు.
Also Read: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు.. సుమన్ శెట్టి గేమ్ స్టార్ట్స్!
టార్చ్ లైట్లతో మద్దతు
తాజాగా, రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు తొలగించిన హైడ్రాకు మణికొండ వెంకటేశ్వర కాలనీ ప్రజలు వినూత్నంగా మద్దతు తెలిపారు. పరిసర కాలనీల ప్రజలు కలిసి బుధవారం సాయంత్రం ర్యాలీగా వచ్చి సెల్ ఫోన్ల టార్చ్ లైట్లు వెలిగిస్తూ హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. 9 కిలోమీటర్ల దూరంలో 2 కిలోమీటర్ల మేర ఆక్రమణల కారణంగా ఆగిపోయిన రోడ్డు పనులను, హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించడంతో జీహెచ్ఎంసీ తిరిగి మొదలుపెట్టింది. దీంతో 60 అడుగుల వెడల్పు రోడ్డుకు లైన్ క్లియర్ అవ్వగా, స్థానికులు ‘థాంక్స్ టు హైడ్రా’ అని నినాదాలు చేశారు. హైడ్రాపై దుష్ప్రచారం తగదని హితవు పలికిన స్థానికులు, కొంతమంది స్వార్థానికి అందరూ బలి కావద్దని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పని చేస్తున్న విషయం పలు సందర్భాల్లో నిరూపితమైందని స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!
