Hyderabad MMTS Train: మహిళలపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. స్త్రీలు ఎక్కడికి వెళ్లినా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది. దీంతో ఒంటరిగా తిరగాలంటేనే ఒకటికి రెండు సార్లు స్త్రీలు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు జనసందోహంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ ఉంటారు కదా అని భావించి హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కిన మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. దీంతో రైలులో మహిళల భద్రతకు సంబంధించిన అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
బోగిలో ఒంటరిగా ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన బాధితురాలు (23) ఉద్యోగ రిత్యా హైదరాబాద్ కు వచ్చింది. మేడ్చల్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఆ ఏరియాలో నివాసముంటోంది. ఈ క్రమంలో యువతి మెుబైల్ చెడిపోవడంతో ఆమె శనివారం సికింద్రాబాద్ వెళ్లింది. అక్కడ ఫోన్ రిపేర్ చేయించుకొని రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ లో మేడ్చల్ కు వెళ్తే తనకు సేఫ్టీ ఉంటుందని యువతి భావించింది. ఈ నేపథ్యంలో MMTS రైలులో మేడ్చల్ కు తిరుగు ప్రయాణమైంది. బాధితురాలు లేడీస్ కోచ్ లో ఎక్కగా అప్పటికే ఇద్దరు మహిళలు బోగీలో ఉండటంతో ఆమె మరింత సేఫ్ గా భావించింది. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు మహిళలు ఆల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. దీంతో బోగిలో బాధితురాలు ఒక్కతే బోగిలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చింది.
బోగిలో పెనుగులాట
బాధితురాలు ఒక్కతే బోగిలో ప్రయాణించిన ఓ మృగాడు.. ఒక్కసారిగా లేడీస్ కోచ్ లోకి ప్రవేశించాడు. ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమె అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రాణం కంటే మానమే ముఖ్యమని భావించిన ఆ యువతి క్షణం ఆలోచించకుండా కదులుతున్న రైలు నుంచి కిందకి దూకేసింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పై పడి అటుగా వెళ్తున్న వారికి కనిపించింది.
ఆస్పత్రికి తరలింపు
స్పృహా కోల్పోయి ట్రాక్ పై పడి ఉన్న యువతిని చూసి అటుగా వెళ్తున్న వారు షాక్ కు గురయ్యారు. వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది.. గాయాలతో ఉన్న యువతిని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో యువతికి ట్రీట్ మెంట్ జరుగుతోంది. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Read Also: Delimitation – TDP Alliance: ముందు నుయ్యి వెనక గొయ్యి.. ఇరకాటంలో కూటమి.. అసలేం జరుగుతోంది?
నిందితుడి కోసం గాలింపు
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనపై రైల్వే ఎస్పీ చందనా దీప్తీ స్పందించారు. బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. నిందితుడి కోసం రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు. కదులుతున్న రైలు నుంచి దూకడంతో యువతి తలకు బలమైన గాయం అయినట్లు ఎస్పీ తెలిపారు. 24 గం.ల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నట్లు రైల్వే ఎస్పీ చందనా తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడ్ని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.
భద్రతపై ప్రశ్నలు
ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం జరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రైలులో మహిళలకు భద్రతా లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి వేలల్లో మహిళలు ఈ లోకల్ ట్రైన్స్ లో ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్త్రీల కోసం రాత్రిళ్లు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.