Delimitation – TDP Alliance: 2026లో జరగనున్న లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మంటలు రేపుతోంది. తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ (Delimitation) జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం తప్పదని తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై కేంద్రంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటి సైతం జరిగింది. త్వరలో హైదరాబాద్ లో రెండో సదస్సు సైతం నిర్వహించ తలపెట్టారు. అయితే సౌత్ లో అగ్గిరాజేస్తున్న డీలిమిటేషన్ రచ్చపై ఏపీ ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోతోంది. దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న నిరసనలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోతోంది.
కన్ఫ్యూజన్ లో ఏపీ సర్కార్?
కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Govt) తో ఏపీ ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ (TDP)కి చెందిన ఇద్దరు ఎంపీలు.. ప్రస్తుతం కేంద్రమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ వివాదంపై కూటమిలోని తెలుగు దేశం, జనసైన పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. డీలిమిటేషన్ జరిగితే లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. పొత్తును గౌరవిస్తూ సైలెంట్ అయిపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో చేతులు కలిపితే కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురవుతామని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.
త్రిభాషా విధానంపైనా..
జాతీయ విద్యా విధానంలో కేంద్రం సూచించిన త్రిభాషా సూత్రంపై సౌత్ లో రచ్చ నడుస్తోంది. దీని ద్వారా హిందీ (Hindi)ని బలవంతంగా తమపై రుద్దాలని చూస్తున్నారంటూ తమిళనాడు సహా పలు సౌత్ స్టేట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దడాన్ని ఏమాత్రం అంగీకరించమని తేల్చి చెబుతున్నాయి. ఈ అంశంలోనూ ఏపీ ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోతోంది. హిందీని రుద్దడాన్ని ఏమాత్రం సహించనని గతంలో వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్ సైతం ఇప్పుడు ప్లేటు ఫిరాయించారన్న విమర్శలు ఉన్నాయి. త్రిభాష విధానమంటే భాషను బలవంతంగా రుద్దడం కాదు అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యానించడంపై పొలిటికల్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంశాల వారీగా తన అభిప్రాయాన్ని ఏమాత్రం బెరుకులేకుండా చెప్పే పవన్ సైతం ఇలా కీలకమైన డీలిమిటేషన్, త్రిభాషా సూత్రం విషయంలో యూటర్న్ తీసుకోవడమేంటని పొలిటికల్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Also Read: Local Body MLC Elections: హైదరాబాద్ లో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. ఏప్రిల్ 23న పోలింగ్
డీలిమిటేషన్ తో నష్టం ఎలాగంటే?
జనాభా ఆధారంగా లోక్ సభ నియోజవర్గాలను విభజించడాన్ని డీలిమిటేషన్ గా పిలుస్తారు. అయితే లెటెస్ట్ సెన్సెస్ లెక్కల ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ మెుదలుపెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్రం సూచించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు గణనీయంగా జనాభా పెరుగుదలను నియంత్రించాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలు అందులో విఫలమై జనాభా పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే జనాభా అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్ సభ స్థానాలు వెళ్లడంతో పాటు.. తమకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గిపోతుందని సౌత్ స్టేట్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు అఖిల పక్ష భేటిలను నిర్వహిస్తున్నాయి.