Air Quality Index: వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో హైదరాబాద్(Hyderabad)లో గాలి నాణ్యత క్షీణించింది. టపాసులు భారీగా కాల్చడంతో కాలుష్యం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పీఎం 10 స్థాయి 62 శాతం కాలుష్యం ఎక్కువైందని అధికారిక గణంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 153గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) నమోదు కాగా కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్ నగర్ అధికంగా వాయు కాలుష్యం పెరిగినట్లు సమాచారం. సాధారణ రోజుల్లో ఎయిర్ క్వాలిటీ పీఎం 2.5 స్థాయి 37 శాతం ఉంటుంది. అయితే, దీపావళి రోజు ఒక్కసారిగా 69 శాతంగా నమోదు అయింది. అంటే 32 శాతం అదనంగా పెరిగింది. దాదాపు రెట్టింపు అని స్పష్టమవుతున్నది. పీఎం 10 స్థాయి సాధారణ రోజుల్లో 91 శాతం ఉంటుంది. దీపావళి నాడు 153 శాతం నమోదు అయింది. 42 శాతం 24 గంటల్లోనే నమోదు కావడంతో సైంటిస్టులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం
అధికంగా పెరిగిన కాలుష్యం దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కుల్లో సమస్యలు, తుమ్ములు, గొంతు పొడి బారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడం, వాహనాల రద్దీ పెరిగిపోవడం, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం వల్లే గాలి నాణ్యత పడిపోతున్నదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. నగరంలో ఇటీవల గాలి నాణ్యతలో గణనీయమైన క్షీణత కనిపిస్తున్నది.
Also Read: Indian Boycott: టర్కీ, అజర్‌బైజాన్‌లకు బుద్ధి చెబుతున్న భారతీయులు.. ఏం చేస్తున్నారో తెలుసా?
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
ఈ ఏడాది దీపావళికి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాసులు కాల్చాలని సూచించింది. కానీ, ప్రజలు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా రెండు రోజులుగా కాల్చడంతో వాయి కాలుష్యం పెరిగిందనేది స్పష్టమవుతున్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే కాలుష్యం లేదని బాగుందని అర్ధం కానీ 153కు దీపావళితో పెరిగింది. అధికారులు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గిందని, ఆక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు పరిశీలించి నివేదికను విడుదల చేశామని పేర్కొంటున్నారు.
అధికారుల లెక్కల్లో అనుమానాలు
ఇండస్ట్రియల్ ఏరియాలైన పటాన్ చెరువు, కాప్రా, బొల్లారం, సోమాజిగూడ, సనత్ నగర్‌లో గాలి కాలుష్యం ఎంత పెరిగింది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత నమోదు అయింది? సోమాజిగూడ, న్యూ మలక్ పేట, యూఎస్ కాన్సులేట్ వద్ద ఎంత నమోదు అయింది మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. కేవలం నామ్ కే మాత్రం లెక్కలు వెల్లడించారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకు వివరాలు వెల్లడించడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అధికారులు తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఏరియా వారీగా వివరాలు వెల్లడించడం లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
