HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) (HMDA) మరోసారి ఆదాయ పెంపు లక్ష్యంగా వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. కొత్తగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధి, స్కైవాక్‌ల నిర్మాణం, అలాగే వచ్చే ఏడాది మాస్టర్ ప్లాన్ 2050ని ఖరారు చేయాలని హెచ్‌ఎండీఏ (HMDA) నిర్ణయించినట్లు గురువారం వెల్లడించింది.
లేఅవుట్ల అభివృద్ధి..
హెచ్‌ఎండీఏ (HMDA) తాజాగా కంది, ఫసల్‌వాడీ, పెద్ద కంజర్ల ప్రాంతాల్లో కొత్తగా లేఅవుట్లను అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే ప్రతాపసింగారం, బాచుపల్లి, (Bachupally) ఇనుముల్ నర్వ, లేమూరు ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేశామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రైతులు, భూ యజమానులతో చర్చించి భూములు సేకరిస్తున్నామని, దీంతోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించి పెద్ద పెద్ద లేఅవుట్లు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. (HMDA)హెచ్‌ఎండీఏకు చెందిన భూములు, లేఅవుట్లలో 10 శాతం మార్ట్ గేజీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించడంతోపాటు రెంట్, లీజు వంటి విధానాలతో మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Private Education: ప్రైవేట్ విద్యాసంస్థల మజాకా?.. మమ్మల్ని ఆపేవారు లేరు!
మరో నాలుగు స్కైవాక్‌లు..
మహానగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు (HMDA హెచ్‌ఎండీఏ మరో నాలుగు స్కైవాక్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్, మెట్రో రైలు ప్రాజెక్ట్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతోపాటు రేతిఫైల్, సికింద్రాబాద్, (Secunderabad) కీస్ హైస్కూల్ బస్‌స్టాప్‌లను కలిపే విధంగా స్కైవాక్ రూపకల్పనకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అలాగే, కూకట్‌పల్లి జేఎన్‌టీయూ నుంచి మెట్రోస్టేషన్ వరకు, జేఎన్‌టీయూ నుంచి ప్రగతి నగర్ మార్గంలో వెళ్లే పాదచారుల కోసం స్కైవాక్స్ నిర్మాణం చేపట్టాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గం (ఎడమ)లో శ్మశాన వాటిక ఉండటంతో గతంలో వెనక్కి తగ్గినప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతిపాదనల్లో మార్పులు చేసుకుని అక్కడ కూడా స్కైవాక్ ఏర్పాటు ఎంతో అవసరమని హెచ్‌ఎండీఏ భావిస్తున్నది. మెహిదీపట్నంలో అత్యధిక రద్దీగా ఉండే రెండు జంక్షన్లను దాటేందుకు పాదచారుల కోసం ఇటీవల ఏర్పాటు చేసిన స్కైవాక్‌ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది మాస్టర్ ప్లాన్ 2050 ఖరారు..
రానున్న 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ (HMDA) రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్-2050ని వచ్చే సంవత్సరం ఖరారు చేయాలని భావిస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ పనులు 2026 ఏప్రిల్/మే మాసాల్లో పూర్తి కానున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాన్, బ్లూ అండ్ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించిన అనేక రకాల సలహాలు, సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ఖరారు చేయాలని హెచ్‌ఎండీఏ (HMDA) భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, (HMDA) హెచ్‌ఎండీఏకు సంబంధించిన లేఅవుట్లలోని స్థలాల్లో కొత్తగా పార్కులను ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ, మరిన్ని పార్కులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు కాలనీలు, మున్సిపాలిటీల్లో పట్టణీకరణ పెరుగుతున్నందున రాకపోకలకు కనెక్టివిటీ పెరిగేందుకు వీలుగా కొత్తగా రోడ్లను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!