GHMC on Rains: రానున్న వర్షకాలానికి సంబంధించి జీహెచ్ఎంసీ కాస్త ముందుగానే అలర్ట్ అయింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు 1వ తేదీన కేరళ తీరాన్ని దాటనున్నట్లు ఐఎండీ చేసిన ప్రకటనతో పాటు ఎపుడు అకాల వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితులు నెలకున్నందున జీహెచ్ఎంసీ కాస్త ముందుగానే అప్రమత్తమైంది. సాధారణంగా ఎండాకాలం చివరి రోజుల్లో రూపకల్పన చేసే మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను ఈసారి కాస్త ముందుగానే సిద్దం చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నగరంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి నగరం అస్తవ్యస్తంగా మారినపుడు జీహెచ్ఎంసీ అకాల వర్షాలను సీరియస్ గా తీసుకుని ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది.
చిన్నపాటి వర్షం పడితే నగరంలో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో భారీగా వర్షపు నీరు నిలుస్తుంది. ఫలితంగా వాహనరాకపోకలు స్తంభించి, భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో వాహనదారులకు, పాదచారులకు కష్టాలు తప్పని పరిస్థితులు నెలకున్నందున వర్షాకాలంలో వానాకాలం కష్టాల నివారణకు తీసుకునే చర్యలను అకాల వర్షాలు కురిసే ఎండాకాలం కూడా కొనసాగించేందుకు వీలుగా సిద్దంగా ఉండాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వార్డుకు మూడు ఎమర్జెన్సీ టీమ్ లను కేటాయించటంతో పాటు ఈ సారి కాస్త ముందుగానే శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించే బాధ్యత టౌన్ ప్లానింగ్‌కు అప్పగించగా, గుర్తించిన భవనాల స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనా వేసే పనిని ఇంజనీరింగ్ కు అప్పగిస్తూ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Electrical Supply Stores: భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌కు సిద్దం.. సమీక్షలో కీలక నిర్నయాలు!
వానా కాలానికి ముందే
ఇప్పటికే నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేయటంతో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ విభాగం స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనా వేసిన తర్వాత మరమ్మతులు చేసేందుకు ఆ భవనాల యజమానులు అంగీకరించినా, జీహెచ్ఎంసీ మార్గదర్శకాలకు అనుకూలంగా పటిష్టపు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. త్వరలోనే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు భవనాలను గుర్తించి, నివేదికలను అందజేయనున్నట్లు తెలిసింది. మొత్తానికి వానాకాలం ప్రారంభానికి ముందే ఈ భవనాలపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
వాటర్ స్టాగినేట్ నివారణకు చర్యలు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ మోస్తారు వర్షం కురిస్తే చాలు సుమారు 441 ప్రాంతాల్లో వాటర్ స్టాగినేట్ అయి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి. ఈ పాయింట్ల వద్ద నీరు నిల్వగుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఐఎండీ హెచ్చరిక ప్రకారం 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటే అవకాశమున్నందున, ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీకి ముందే వాటర్ స్టాగినేట్ నివారణ చర్యలు చేపట్టాలని, శాశ్వత చర్యలు చేపట్టే అనుకూలమైన పరిస్థితుల లేని ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సారి వర్షాకాలం ముందుగా ప్రారంభమయ్యే అవకాశముండటంతో, ముందుగానే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ మహానగరవాసులకు ఏ మేరకు వానా కాలం కష్టాలను తగ్గిస్తుందో వేచి చూడాలి.
Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!