Serilingampally: ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో శేరిలింగంపల్లి లోని పలు ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునగగా, వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీరు వెళ్లేందుకు కాలువలు లేకే ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభానికే పరిస్థితులు ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా సరైన జాగ్రత్త చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉంటాయంటో కోరుతున్నారు.
నీట మునిగిన లింగంపల్లి అండర్ బ్రిడ్జ్…
ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించినప్పటికీ పరిస్థితి అదే విధంగా ఉంది. కొద్దిపాటి వర్షానికే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునగడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: ACB Arrest: కాళేశ్వరం మాజీ ఈఈ అరెస్ట్.. రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు సీజ్!
అగమ్యగోచరంగా పాపి రెడ్డి కాలనీవాసుల పరిస్థితి…
పాపి రెడ్డి కాలనీ నుంచి చందానగర్ – లింగంపల్లి వెళ్లేందుకు ఉన్న రహదారులు పూర్తిగా వరద నీటితో మునగడంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్, చందానగర్ రైల్వే అండర్ పాస్ లు పూర్తిగా వరద నీటితో మునిగిపోతుండడంతో వర్షాకాలం ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. చందానగర్ వెళ్లాలంటే నల్లగండ్ల ఫ్లైఓవర్ నుంచి తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేక అవస్థలు పడుతున్నారు.
స్కూల్, ఆఫీసులో, పనులకు వెళ్లే వారికి నరకయాతనే మిగులుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతున్నప్పటికీ అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు గాని ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్, రాజీవ్ స్వగృహ, ఆరంభ టౌన్షిప్, సురభి కాలనీలలో వేలాదిమంది నివాసం ఉంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు మార్గం చూపాలని కోరుతున్నారు.