Gun Culture Hyderabad: హైదరాబాద్‌లో తరచూ అక్రమ ఆయుధాలు గర్జిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు, రివాల్వర్లు, పిస్టళ్లు తెప్పించుకుంటున్న కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. దోపిడీలు చేయడమే వృత్తిగా చేసుకున్న వారు కూడా వీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో జనంలో తీవ్ర కలవరం వ్యక్తమవుతున్నది.
మొన్న సీపీఐ నేత హత్య.. తాజాగా దోపిడీ
సీపీఐ రాష్ట్ర నేత చందూ నాయక్(Chandu Nayak) ఇటీవల శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ ముగించుకుని బయటకు రాగానే అతని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఉదంతాన్ని మరిచిపోక ముందే తాజాగా దోపిడీ దొంగలు చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. ఏడాది క్రితం బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లా ఫతేపూర్‌కు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్‌లు బీదర్‌లో ఏటీఎం సెంటర్లలో డబ్బులు నిల్వ చేయడానికి వచ్చిన క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఉద్యోగి గిరి వెంకటేశ్‌ను కాల్చి చంపారు. మరో ఉద్యోగి శివ కుమార్‌పై కూడా కాల్పులు జరిపి 93లక్షలతో ఉడాయించి హైదరాబాద్ వచ్చారు.
అఫ్జల్ గంజ్(Afzal Ganj) వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయం ఉద్యోగిపై కూడా కాల్పులు జరిపి ఉడాయించారు. ఏడాదైనా ఇప్పటికీ ఈ ఇద్దరు చిక్కలేదు. స్నాచింగులు చేయడమే పనిగా పెట్టుకున్న ఇషాన్, రాహుల్ అనే పాత నేరస్తులు తమను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే తప్పించుకోవడానికి తుపాకులు కొని పెట్టుకుని పోలీసులకు చిక్కారు.
Also Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
అక్కడ కుటీర పరిశ్రమల్లా..
దీనిపై సీనియర్ పోలీస్(Police) అధికారులతో మాట్లాడగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా అక్రమ ఆయుధాలు నగరానికి వస్తున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాటు తుపాకులు, పిస్టళ్లు, రివాల్వర్లు తయారు చేయడం కుటీర పరిశ్రమలా మారిపోయిందని తెలిపారు. ముఖ్యంగా బిహార్‌లోని ముంగేర్, గయ, ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని నాన్ గల్, హసన్ పూర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అక్రమ ఆయుధాల తయారీ జరుగుతున్నట్టు చెప్పారు. ఒకప్పుడు తపంచాలు మాత్రమే తయారు చేసే తయారీదారులు ఇప్పుడు సేఫ్టీలాక్ ఉన్న రివాల్వర్లను కూడా తయారు చేస్తున్నట్టు తెలిపారు.
వేలల్లోనే ధరలు
అక్రమ ఆయుధాల తయారీదారులు తపంచాను 2 నుంచి 4 వేలకు, రివాల్వర్‌ను 10 నుంచి 15వేలకు అమ్ముతున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. పిస్టల్ 15 నుంచి 20 వేలకు, సింగిల్ షాట్ గన్‌ను 20వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలిపాయి. ఆటోమేటెడ్ పిస్టల్ 20 నుంచి 25 వేలు, ఆటోమేటెడ్ రివాల్వర్‌ను 30 వేలకు అమ్ముతున్నట్టు చెప్పాయి.
రైళ్లు, ట్రాన్స్‌పోర్ట్ లారీల్లో..
ఇక, పోలీస్(Police) వర్గాల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం అక్రమ ఆయుధాలను ఇక్కడికి తరలించడానికి కొన్ని గ్యాంగులు పని చేస్తున్నాయి. వీటిల్లోని సభ్యులు రైళ్లు, ట్రాన్స్ పోర్ట్ లారీల్లో ఇక్కడికి చేరుస్తున్నారు. రైళ్లలో పెద్దగా తనిఖీలు జరగక పోతుండడం, ట్రాన్స్ పోర్టు లారీలను పట్టించుకోకపోతుండడంతో వీరి ఆయుధ స్మగ్లింగ్ వ్యాపారం నిరాటంకంగా సాగుతున్నది. ఏదైనా గ్యాంగ్ అక్రమ ఆయుధాలతో దొరికితే వారి అరెస్టుతోనే కేసులు ఆగిపోతున్నాయి. దీనికి కారణం ఆయుధాలు తయారవుతున్న రాష్ట్రాలకు మన పోలీసులు వెళ్లినా అక్కడి పోలీసులు సహకరించకపోతుండడమే అని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. కొన్నిసార్లు మన పోలీసులపై దాడులు కూడా జరిగాయని తెలియ చేశాయి. దాంతో ఏమీ చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించాయి. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం కుదిరితేనే అక్రమ ఆయుధాల దందాకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నాయి.
అనధికారికంగా రెండింతలు (spl box)
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,125 లైసెన్సులు జారీ అవగా 9,294 ఆయుధాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలోనే కొత్తగా 510 లైసెన్సులు జారీ అయ్యాయి. అయితే, అధికారికంగా ఉన్న వాటికి రెండింతల అక్రమ ఆయుధాలు ఉండి ఉండవచ్చని పోలీస్ వర్గాలు అంటున్నాయి.
Also Read: Jogulamba Gadwal: యూరియా కోసం రైతుల అవస్థలు.. పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారన్న ఆరోపణలు