Jogulamba Gadwal: ఖరీఫ్ సీజన్ మొదలవ్వగానే రైతులకు యూరియా (Urea) కష్టాలు మొదలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లోని కేటీదొడ్డి మండలంలో యూరియా (Urea) కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దానిని అధిక ధరలకు పక్క రాష్ట్రమైన కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారని రైతులు(Farmers) ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ దందా గుట్టుగా సాగుతుందని రైతులు చెబుతున్నారు.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర
పక్క రాష్ట్రానికి యూరియా..
కేటీదొడ్డి మండలంలో మొత్తం 23 గ్రామాలు, 28 ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సరిపడా యూరియా(Urea) అందుబాటులో లేకపోవడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి యూరియా (Urea) కోసం రోజుల తరబడి దుకాణాల ముందు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తుండడంతో పంటలకు అది సరిపోవడం లేదు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు, యూరియా(Urea) కు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ-పాస్ సిగ్నల్స్ రావడం లేదనే సాకుతో యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 266 కాగా, బ్లాక్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ఒక్కో బస్తాను రూ. 350 వరకు అమ్ముకుంటున్నారని సమాచారం.
కర్ణాటకకు తరలింపు?
యూరియా(Urea) దొరక్క తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే, కొంతమంది అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై యూరియా(Urea) ను కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం పీఏసీఎస్ నుంచి యూరియా లోడ్ ను కర్ణాటకకు తరలిస్తున్నారని ఆరోపణలు రావడంతో స్థానికులు దానిని అడ్డుకున్నారు. అలాగే నందిన్నెలోని అగ్రోస్ దుకాణం నుంచి కర్ణాటక రైతులు బొలేరో వాహనాలలో రోజూ యూరియా కొనుగోలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రైవేట్ డీలర్లు రూ. 350 నుంచి 400 వరకు బ్లాక్ లో విక్రయిస్తున్నా, ఈ సరిహద్దు ప్రాంతంలోని దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి యూరియా(Urea) కొరత లేకుండా చూడాలని రైతులు(Farmers) కోరుతున్నారు.
యూరియా కొరత లేదు..
అయితే, ఈ ఆరోపణలను మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. మండలంలో యూరియా(Urea) కొరత లేదని, సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా