Jubilee hills KBR Park (imagecredit:twitter)
హైదరాబాద్

Jubilee hills KBR Park: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఆగిన స్థల సేకరణ

Jubilee hills KBR Park: మహానగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబీఆర్ పార్కుచుట్టూ చేపట్టాల్సిన హెచ్ సిటీ పనులను సీఎం రేవంత్ రెడ్డి గత డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించిన ఇప్పటి వరకు పనులు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. జీహెచ్ఎంసీలోని ఇంజనీర్ల కొరత, నిధుల లేమితో పాటు స్థల సేకరణకు ఎదురైన అడ్డంకులు ఓ కారణంగా కాగా, సీఎం మానస పుత్రిక అయిన హెచ్ సిటీ పనులను పట్టాలెక్కించేందుకు కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కేబీఆర్ చుట్టూ ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్‌లకు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టినా, అధికారులు నేటికీ కనీసం పనులపై క్లారిటీ ఇవ్వటం లేదు. సీఎం ఆదేశాలతో ఎంతో హడావుడి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు స్థల సేకరణకు మార్కింగ్ చేసినా, కొందరు వ్యక్తులు తాజాగా కోర్టును ఆశ్రయించటంతో కేబీఆర్ చుట్టూ చేపట్టాల్సిన హెచ్ సిటీ పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాల్లేవని చెప్పవచ్చు.

నిర్మాణానికి రూ.1090 కోట్ల ప్రతిపాదనలు

కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత, పాదచారుల రక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పార్కు చుట్టూ ఆరు ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ నిర్మాణానికి రూ.1090 కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేసిన జీహెచ్ఎంసీ ఇందుకు సంబంధించి రూ.845 కోట్లకు సర్కారు నుంచి పరిపాలనపరమైన ఆమోదం కూడా పొంది, స్థల సేకరణకు మార్కింగ్ కూడా చేసింది. మూడు జంక్షన్లకుగానూ105 చోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం కూడా తీసుకున్నారు. ఇందుకు 18 చోట్ల ఆస్తుల నుంచి స్థలాలను సేకరించేందుకు సిద్దమైన జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు జంక్షన్‌లో రహదారి విస్తరణలో 47 ఆస్తులు, ముగ్ధ జంక్షన్‌ విస్తరణలో భాగంగా 40 ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించేందుకు, మొత్తం 105 ఆస్తులకు మార్కింగ్ చేసినా, ప్రస్తుతం స్థల సేకరణ ప్రక్రియ కు బ్రేక్ పడినట్లు సమాచారం.

అక్కడ గజం రేటు రూ 4 నుంచి 5 లక్షల మధ్యే

కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ-1 పనుల కోసం జీహెచ్ఎంసీ గుర్తించిన మొత్తం 105 ఆస్తులకు మార్కింగ్ చేయగా, ఒక్కో ఆస్తి నుంచి 30 నుంచి 50, 60 అడుగుల వరకు స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ప్రైమ్ లొకేషన్ కావటం, గజం స్థల విలువ రూ. 4 నుంచి 5 లక్షల మధ్య ఉండటంతో స్థలాలను వదులుకునేందుకు కొందరు బడా బాబులు సిద్దంగా లేరని తెలిసింది. ఇందుకు గాను జీహెచ్ఎంసీ స్థల సేకరణ ప్ర్రక్రియను అడ్డుకునేందుకు లీగల్‌గా తమకు అనుకూలమైన లొసుగులను అన్వేషిస్తున్నట్లు సమాచారం. పార్కుచుట్టూ నిర్మించనున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల అలైన్ మెంట్ ను మార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: CM Revanth Reddy: కాళేశ్వరంపై నేడు కేసీఆర్.. ఎల్లుండి రేవంత్.. ఢిల్లీలో క్లారిటీ!

మాజీ మంత్రి ఒకరు కీలక పాత్ర

ఈ ప్రయత్నాల్లో ఓ ఆంధ్రా వ్యాపారితో పాటు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తన ఆస్తి అని ప్రస్తుతం పొజీషన్‌లో ఉన్న ఓ మాజీ మంత్రి వద్ధ జీహెచ్ఎంసీ సేకరించనున్న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉండటంతో ఎలాగైనా ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రకటించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ పనులకు అధికార పార్టీ నేతలే పరోక్షంగా అడ్డుపడుతున్నారన్న వాదనలున్నాయి. నేరుగా సీఎం చొరవ తీసుకుని సమీక్షిస్తే గానీ, ఇక్కడ స్థల సేకరణకు పట్టిన గ్రహణం వీడే అవకాశం లేదు.

ఒత్తిడి తట్టుకోలేక

కేబీఆర్ పార్కుచుట్టూ చేపట్టనున్న హెచ్ సిటీ -1 పనులకు స్థలాలిచ్చే ఇష్టం లేని కొందరు బడా బాబులు, వ్యాపారులు పరోక్షంగానే పనులను అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ వ్యాపారికి చెందిన ఆస్తి నుంచి సుమారు 30 అడుగుల స్థలాన్ని సేకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసినా, తనకు అనుకూలంగా మార్కింగ్ మార్చేందుకు వీలుగా సదరు వ్యాపారి జీహెచ్ఎంసీ అధికారులతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. పార్కుచుట్టూ నిర్మించే హెచ్ సిటీ -1 పనులకు సంబంధించి ఓ మాజీ మంత్రితో కలిసి సదరు వ్యాపారి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజీయ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ ఇంజనీర్లు

అలైన్ మెంట్ మార్పు, స్థల సేకరణ నుంచి ఆస్తులు కాపాడాలంటూ వస్తున్న వత్తిళ్లను తట్టుకోలేక జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పనులు చేపట్టేందుకు కావల్సిన స్థాయిలో ఇంజనీర్లు అందుబాటులో లేరన్న విషయాన్ని సాకుగా చూపుతూ ప్రతిపాదనలను తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ బడాబాబులు వత్తిడి తలొగ్గి సర్కారు అలైన్ మెంట్‌ను మార్చుతుందా? లేక ఇప్పటికే ఆలస్యమైన కేబీఆర్ పార్కు చుట్టు పనులకు ఎవరికెలాంటి మినహాయింపులివ్వక స్థల సేకరణను వేగవంతం చేస్తుందా? వేచి చూడాలి.

Also Read: Vanamahotsavam: వనమహోత్సవాన్ని ఉద్యమంలా తీసుకెళ్లాలి

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు