Godavari Project: హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి సర్కారు ఆమోదించిన గోదావరి ఫేజ్ -2,3 పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. గోదావరి ఫేజ్-2,3 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. రూ. 7,360 కోట్ల వ్యయంతో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల పనులను త్వరగా ప్రారంభించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
Also Read: 80s Reunion Party: అలనాటి సీనియర్ నటుల అపురూప కలయిక.. ఇక మామూలుగా ఉండదుగా..
మరో 20 టీఎంసీల నీరు
ఘన్ పూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు ఉన్న 56 కిమీటర్ల మేరకు నిర్మించ తలపెట్టిన రెండు వరుసల పైప్ లైన్ కు పనులకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. రోడ్ క్రాసింగ్, టన్నెలింగ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎండీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేద్రాల పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోందని, సర్కారు తాజాగా మంజూరు చేసిన 2,3 దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉందన్నారు.
3000 ఎంఎం డయా భారీ పైపు లైన్
ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను వినియోగిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయని, ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చేయటమి ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3000 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నామని తెలిపారు.
1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి
అంతేగాక, ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నట్లు, ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2,3 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మరో 300 ఎంజీడీల నీరు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎమ్ మహేష్ కుమార్ లతో పాటు సంబంధిత అధిరకారులు పాల్గొన్నారు.
Also Read: Ganja Addiction: గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత.. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు
