Allegations on GHMC: రాష్ట్రంలో సర్కారు మారి 17 నెలలు గడుస్తున్నా జీహెచ్ఎంసీ ఇంకా గులాబీ పాలన మోడ్ లోనే కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సర్కారు నిర్ణయాలు, ఆదేశాలంటే అసలు లెక్కలేకుండా పోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డు అధికారులు కొనసాగింపులు, ప్రైవేటు వ్యక్తులను ఔట్ సోర్స్ ప్రాతిపదికన నియమించుకోవటం వల్లే గత ప్రభుత్వ హాయంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని భావించిన సర్కారు ఎవర్ని నియమించాలన్నా, ఎవరినైనా విధుల్లో నుంచి తొలగించాలన్నా తమ అనుమతి తప్పనిసరి అంటూ జారీ చేసిన ఆదేశాలు జీహెచ్ఎంసీలో బుట్టదాఖలయ్యాయి.
రిటైర్డు అయిన ఆఫీసర్లందర్నీ ఇంటికి పంపాలని ప్రభుత్వం పలుసార్లు నొక్కి చెప్పినా, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఈ ఆదేశాలేమీ అమలు చేయకపోగా, అడ్డదారిలో నియామకాలు చేయటం గమనార్హం. అవసరం లేకపోయినా అడ్డదారిలో ఇష్టారాజ్యంగా నియామకాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మహానగరంలోని పార్కులు, పచ్చదనం పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అర్బన్ బయోడైవర్శిటీ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా నియామకాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావు ఆదేశాలపై.. మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేక స్వాగతం!
17 నెలల క్రితం రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రేస్ సర్కారు తమ అనుమతి లేకుండా రిటైర్డు ఆఫీసర్లను కొనసాగించరాదని, ప్రైవేటు, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించరాదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, యూబీడీలో అడ్డదారిలో జరిగిన నియామకాలు ఇపుడు జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పాలన హయాంలో 2016లో ఫీల్డు లెవెల్ లో పార్కులు, పచ్చదనం పర్యవేక్షణ కోసం 38 మంది ఫీల్డు అసిస్టెంట్లు, మరో 19 మంది టెక్నికల్ అసిస్టెంట్లను నియమించుకున్నారు.
వారి గడువు కూడా ముగిసింది. కానీ కొత్త సర్కారు వచ్చిన తర్వాత కొత్త నియామకాలకు సంబంధించి సర్కారు అనుమతి తప్పకుండా తీసుకోవాలంటూ సర్కారు ఆదేశాలున్నా, వాటిని పక్కనబెట్టిన జీహెచ్ఎంసీ యూబీడీ విభాగంలో గత జనవరి మాసం మొదటి వారంలో రహస్యంగా టెండర్ల ప్రక్రియ చేపట్టి, అదే నెల చివరలో టెండర్లను ఓపెన్ చేసి, యూబీడీ విభాగంలో ఓ కీలక అధికారి బినానీగా వ్యవహారిస్తున్న కాంట్రాక్టర్ కు చెందిన ఈ 57 మందిని నియమించినట్లు సమాచారం.
ఒకర్ని నియమించాలన్నా…
జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలతో పాటు డిప్యూటీ మేయర్ ఛాంబర్ లో కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలన్నా, టౌన్ ప్లానింగ్ విభాగంలో రిటైర్డు ఆఫీసర్ల సేవలు కొనసాగించాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాల్సిందే. యూబీడీలో తాజాగా 57 మంది నియామకానికి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉందా?అన్న ప్రశ్నకు అధికారులు విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. 2016లో మొదటి సారిగా 38 మంది ఫీల్డు అసిస్టెంట్లు, మరో 19 మంది టెక్నికల్ అసిస్టెంట్లను నియమించిన తర్వాత వారు ఫీల్డు లెవెల్ లో విధులు నిర్వహిస్తున్నందున, వారికి ఒక్కోక్కరికి రూ. వెయ్యి అలవెన్స్ లు చెల్లించాలంటూ 2019లో స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదన పెట్టారు.
దీంతో స్టాండింగ్ కమిటీ వారికి అలవెన్స్ లు చెల్లించేందుకు ఇచ్చిన ఆమోద తీర్మానం ప్రతిని యూబీడీ అధికారులు చూపిస్తున్నారు. అసలు వారి నియామకానికి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎలాంటి ఆమోదం తెలపలేదు కదా? అన్న విషయాన్ని ప్రస్తావిస్తే వారికి అలవెన్స్ లు మంజూరు చేస్తూ తీర్మానం ఉందని యూబీడీ అధికారులు తప్పించుకునే ధోరణిలో సమాధానం చెబుతున్నారు.
పాలక మండలి, స్టాండింగ్ కమిటీ కళ్లు గప్పి అడ్డదారిలో జరిపిన నియమాకాలను అంగీకరించలేని యూబీడీ విభాగం 38 మంది ఫీల్డు అసిస్టెంట్లు, మరో 19 మంది టెక్నికల్ అసిస్టెంట్ల కు ఒక్కోక్కరికి రూ. వెయ్యి అలవెన్స్ లు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని అడ్డం పెట్టుకుని, కీలక అధికారి బీనామీకి ఫేవర్ చేసేందుకు ఏకంగా 57 మందిని నియామకానికి సంబంధించి కనీసం కమిషనర్ ఆమోదం ఉందా? అన్న ప్రశ్నకు సైతం సమాధానమే లేదు. సర్కారు ఈ విషయాన్నితీసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరిపిన నియామకాలను రద్దు చేసి, దుబారా ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు