GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోటిన్నర మంది జనాభాకు మౌలిక సేవలు అందించే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జరిగిన ఈ మొదటి సమావేశంలో, అధికారులు రూపొందించిన 21 అంశాల అజెండాతో పాటు మరో ఆరు టేబుల్ ఐటమ్స్‌ను కమిటీ చర్చించి, కీలకమైన 18 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని కూడా కమిటీ తీవ్రంగా ఖండించింది.
కీలక నిర్ణయాలు
కమిటీ ఆమోదించిన ముఖ్యమైన అంశాలలో పన్ను బకాయిల కలెక్షన్ కోసం వన్ టైమ్ స్కీమ్ (ఓటీఎస్) అమలుకు అనుమతిస్తూ, తుది అనుమతి కోసం ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జీహెచ్ఎంసీకి చెందిన స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్, ఫాగింగ్ వాహనాలతో సహా అన్ని వాహనాలపై జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో పాటు, ఫిర్యాదుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి 50 సీట్ల ఇన్‌బౌండ్ కాల్ సెంటర్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read: GHMC: రేపటి నుంచి కలెక్టరేట్ జీహెచ్ఎంసీలో ప్రజావాణి.. 25న కౌన్సిల్ సమావేశం!
ఆమోద ముద్ర..
నగరంలో ట్రాఫిక్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనకు, అలాగే ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ జోన్‌లోని 10 క్రీడా సముదాయాల నిర్వహణ టెండర్లకు, శేరిలింగంపల్లిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు లైన్ క్లియర్ చేయబడింది. దీంతో పాటు, చౌమహల్ల ప్యాలెస్ సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం టెండర్లకు అనుమతి లభించింది.
మరికొన్ని కీలక నిర్ణయాలు..
వీటితో పాటు, సనత్‌నగర్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, కూకట్‌పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో రూ. 5 కోట్లతో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, ఫతేహ్‌బౌల్, నానల్‌నగర్ జంక్షన్లలో ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీ నిర్మాణం, సికింద్రాబాద్ జోన్‌లోని సర్కిల్స్‌లో పరిశుభ్రత నిర్వహణ కోసం ప్రత్యేక ఏజెన్సీలతో ఒప్పందాలకు, అబిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని 56 సెల్లార్ దుకాణాల టెండర్ల ప్రతిపాదనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయాలు గ్రేటర్ పరిధిలో అభివృద్ధి, నిర్వహణ సేవలను మెరుగుపరచడంలో తోడ్పడనున్నాయి.
Also Read: GHMC: ట్యాక్స్ మొండి బకాయిల వసూళ్లకు మళ్లీ ఓటీఎస్.. మొత్తం 21 అంశాలతో కమిటీ అజెండా!

