GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న కల్తీ, క్వాలిటీ లేని ఆహార విక్రయ కేంద్రాల ఆగడాలకు త్వరలోనే శాశ్వత ప్రతిపాదిన చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమైంది. ఇపుడు కూడా, మెస్ లు, హోటళ్లు(Hotels), స్వీట్ షాపులు వంటి ఆహార విక్రయ సంస్థలపై స్టేట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి, అనుమానం వచ్చిన, కాలం చెల్లిన సరుకులతో తయారు చేసిన వంటకాల శాంపిల్స్ ను సేకరించి నాచారంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్(National Institute of Nutrition) ల్యాబ్ కు పంపుతున్న రిపోర్టులు త్వరగా రాకపోవటంతో కల్తీ ఆహార విక్రయ కేంద్రాలపై అధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇందుకు త్వరితగతిన శ్యాంపిల్స్ పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలన్న రెండేళ్ల బల్దియా ప్రయత్నం ఎట్టకేలకు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. తొలుత కూకట్ పల్లి(Kukat Pally) జోన్ లో రూ. 5 కోట్ల వ్యయంతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ముందు ప్రతిపాదనలు కూడా సమర్పించారు. ఇందుకు కమిటీ సానుకూలంగా స్పందించటంతో త్వరలోనే ఈ ల్యాబ్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు మొదలు పెట్టింది.
అత్యాధునిక పరికరాలతో..
గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి జోన్‌లో త్వరలోనే రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్(Food Testing Lab) లో శ్యాంపిల్స్ పరీక్షలు త్వరగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా రిపోర్టులు వచ్చే విధంగా అత్యాధునిక మిషనరీని వినియోగించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కల్తీ, కుళ్లిన ఆహారంతో పాటు కాలం చెల్లిన సరుకులతో తయారు చేసిన ఫుడ్ శ్యాంపిల్స్ రిపోర్టులు కేవలం 48 గంటల వ్యవధిలో వచ్చేలా ఫుడ్ టెస్టింగ్ కోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తయారు చేసిన మిషనరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కానీ ల్యాబ్ లో నియమించనున్న సిబ్బందిని ఔట్ సోర్స్ ప్రాతిపదికన నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Governors Powers: బిల్లుల ఆమోదంలో గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
రెండు రాష్ట్రాలకు ఒకే ల్యాబ్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఫుడ్ శ్యాంపిల్స్ పరీక్షలకు నాచారం(Nacharam)లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్(National Institute of Nutrition) ల్యాబ్ మాత్రమే అందుబాటులో ఉంది. రెండు రాష్ట్రాల నుంచి వస్తున్న శ్యాంపిల్స్ పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు సమర్పించేందుకు ఎక్కువ సమయం పడుతున్నందున జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఓ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకోవాలని చాలా రోజుల నుంచి జీహెచ్(GHMC)ఎంసీ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ప్రయత్నం ఫలించి కూకట్ పల్లి జోన్ లో తొలుత ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. కూకట్ పల్లితో పాటు మిగిలిన అయిదు జోన్లలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు వచ్చిన తర్వాత ఆహార విక్రయ కేంద్రాలపై దాడులు, శ్యాంపిల్స్ సేకరణ ప్రక్రియను నిరంతరం చేసి కల్తీ, కలుషిత ఆహార విక్రయానికి, కాలం చెల్లిన సరుకుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్దం చేసింది.
Also Read: Hidma Funerals: ఒకే చితిపై హిడ్మా దంపతులు.. అంత్యక్రియలకు పోటెత్తిన ప్రజలు.. ఆదరణ చూసి షాకైన బలగాలు!

