Governors Powers: గవర్నర్లు, లేదా రాష్ట్రపతి గడువు దాటిపోయిన తర్వాత కూడా బిల్లులను (Governors Powers) తమ వద్దే పెండింగ్‌లో పెట్టుకోవచ్చా? అనే చిక్కుముడిపై సుప్రీంకోర్టు (Supreme court) గురువారం చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలాంటి కాలపరిమితులు విధించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రపతి, లేదా గవర్నర్ల చర్యలు న్యాయస్థానం పరిధిలోకి రాబోవని తేల్చిచెప్పింది. అయితే, బిల్లులు చట్టంగా మారిన తర్వాత న్యాయసమీక్షకు మాత్రమే అవకాశం ఉంటుందని ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వం వహించగా, న్యాయమూర్తులు సూర్య కాంత్, విక్రమ్ నాథ్, పీఎస్ నరసింహా, ఏఎస్ చందుర్కర్ సభ్యులుగా ఉన్నారు.
నిరాకరించకపోతే అంగీకరించినట్టు కాదు
‘డీమ్డ్ అసెంట్’ (నిరాకరిస్తున్నట్టు చెప్పకపోతే ఆమోదించినట్టుగా పరిగణించడం) వాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంలోని 200, 201 అధికరణలు, గవర్నర్ లేదా రాష్ట్రపతి ఒక బిల్లుపై ఆమోదం తెలపడానికి కొన్ని అధికారాలను కట్టబెట్టాయని, కానీ ఈ విషయంలో వారికి కోర్టు కాలపరిమితి విధించి, ఆ గడువు ముగిసిన వెంటనే ‘వాళ్లు ఆమోదం ఇచ్చేసినట్టే అని చెప్పడమంటే, గవర్నర్, లేదా రాష్ట్రపతి చేసే పనిని కోర్టు చేసినట్లే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనర్థం కార్యనిర్వహణ అధికారాన్ని కోర్టు చేతుల్లోకి తీసుకున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇలా చేయడం రాజ్యాంగం పరిధిలో ఆమోదయోగ్యం కాదని, అందుకే ‘డీమ్డ్ అసెంట్’ను తోసిపుచ్చుతున్నట్టు పేర్కొంది.
రాష్ట్రపతి సందేహాలపై విచారణ
ఈ కేసు పూర్వపరాలలోకి వెళ్తే, ప్రభుత్వం పంపిన 10 బిల్లులపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) తన వద్దే ఉంచుకున్నారని, నిర్దిష్ట గడువు దాటిపోయినా నిర్ణయం తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu State) కోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం ఏప్రిల్ 8న కీలకమైన తీర్పు ఇచ్చింది. నిరాకరణ తెలపకపోవడంతో అంగీకారం తెలిపినట్టుగా భావించాలని (డీమ్డ్ ఆమోదం) ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా కోర్టు తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి, పెండింగ్‌లో ఉంచిన 10 బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుంచి ఆమోదం పొందినట్టుగా భావించవచ్చని న్యాయస్థానం ప్రకటించింది. గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
Read Also- Swetcha Exclusive: మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన స్వేచ్ఛ.. ఎప్పటికప్పుడు వరుస కథనాలు
దీంతో, బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఇచ్చిన ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగంలో ఎలాంటి గడువు విధించలేదని, గవర్నర్ తన అధికారాలను వినియోగించే విషయంలో న్యాయస్థానాలు గడువును విధించవచ్చా?, రాష్ట్రపతికి ఉన్న రాజ్యాంగ విచక్షణాధికార వినియోగం న్యాయస్థానం పరిధిలోకి వస్తుందా?, గవర్నర్‌కు బిల్లు సమర్పిస్తే మంత్రిమండలి సలహాకు, సూచనకు కట్టుబడి ఉండాల్సిందేనా?, రాష్ట్రపతి పరిస్థితి కూడ ఇంతేనా? అని రాష్ట్రపతి ముర్ము సందేహాలు వ్యక్తం చేశారు. పూర్తిగా పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
