GHMC: కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా? మరో కార్మికుడు మృతి!
GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా? చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మరో కార్మికుడు మృతి!

GHMC: జీహెచ్ఎంసీ అధికారులు కార్మికుల శ్రమ దోపిడీపై చూపుతున్న శ్రద్ధను వారి భద్రతపై చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య ఒప్పందం చేసుకున్న రాంకీ సంస్థ చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు ప్రక్రియలను కేవలం ఆదాయమే లక్ష్యంగా పని చేస్తుందే తప్పా, కార్మికుల సేఫ్టీపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదన్న వాదనలున్నాయి. యూసఫ్‌గూడ డంపింగ్ యార్డ్‌లో శనివారం మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా మిషన్‌లో పడి జీహెచ్‌ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. మృతుడు ఏపీలోని కర్నూలు జిల్లా వాసి సుధాకర్ (39)గా గుర్తించారు. మిషనరీల మధ్య విధులు నిర్వహించే కార్మికులకు ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించని రాంకీ సంస్థ నిర్లక్ష్యమే కారణమంటూ కార్మికుల ఆందోళన చేపట్టి విధుల బహిష్కరించారు. కొద్ది నెలల క్రితం కూడా లోయర్ ట్యాంక్ బండ్‌లోని ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మరో కార్మికుడు ప్రమాదవశాత్తు యంత్రాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కార్మికుడు మృతి

తాజాగా జరిగిన ఘటనలో కూడా రాంకీ సంస్థ నిర్లక్ష్యం, జీహెచ్ఎంసీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్న వాదనలున్నాయి. ఉదయం కార్మికుడు మృతి చెందిన జీహెచ్ఎంసీ పాలక మండలి గానీ, అధికారగణం గానీ స్పందించకపోవడం గమనార్హం. కొద్ది నెలల క్రితం వినాయక నిమజ్జనం రోజును బషీర్‌బాగ్‌లో రోడ్డు దాటుతూ ప్రమాదవశాత్తు టస్కర్ వాహనం కింద పడి ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన విషయం తెలియగానే వెంటనే స్పాట్‌కు చేరుకున్న కమిషనర్ సైతం యూసుఫ్‌గూడ ఘటనపై స్పందించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ఓ దందాగా మారిపోయాయని, కింది స్థాయిలో విధులు నిర్వర్తించే కార్మికులకు నామమాత్రంగా జీతాలు చెల్లిస్తూ, వారికి ఎలాంటి భద్రతా ప్రమాణాలను రాంకీ సంస్థ సమకూర్చక పోవడం, దానిపై జీహెచ్ఎంసీ అధికారులు కనీసం రాంకీని ప్రశ్నించే సాహసం కూడా చేయకపోవడం శానిటేషన్ ఓ దందాగా మారిందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. రాంకీ సంస్థతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిలో పారిశుద్ధ్య ఔట్ సోర్స్ కార్మికులకు అసలు ఎలాంటి విలువే లేదా? అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యానికి సంబంధించి నగరానికి అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు తమ పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకునే అధికారులు ఫీల్డు లెవెల్‌లో కార్మికులు విధులు నిర్వహించకుండా అవార్డులు, మంచి ర్యాంక్‌లు సాధ్యమేనా? అన్న విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కార్మికులు వ్యాఖ్యానించారు.

Also Read: GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

ఇంత చిన్న చూపేందుకు?

పారిశుద్ధ్య విభాగంతో పాటు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఔట్ సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహించే కార్మికులంటే అధికారులకు ఎందుకంత చిన్న చూపు? అన్న వాదనలున్నాయి. కొద్ది నెలల క్రితం యూసుఫ్ గూడలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో కుటుంబం ఉండగా, సాటి ఉద్యోగులు విరాళాలు సేకరించి మరీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే కనీసం ఓ కార్మికురాలు విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందిన విషయాన్ని స్థానిక సర్కిల్ అధికారులు కనీసం కమిషనర్, జోనల్ కమిషనర్ల దృష్టికి తీసుకురాలేదంటే అధికారులకు కార్మికులపై ఎంతటి చిన్నచూపు ఉందో? అంచనా వేసుకోవచ్చు. డైలీ ముక్కు పండి కార్మికులతో పని చేయిస్తూ, వారి శ్రమను దోచుకుంటున్న అధికారులు మరో అడుగు ముందుకేసి చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాల్సి పోయి, ఆ పోస్టుకు రేటు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారంటే, జీహెచ్ఎంసీ అధికారులకు మానవత్వం ఉందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

నిర్లక్ష్యానికి నిదర్శనం ఇది

జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్స్ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం కాగా, పర్మినెంట్ ఉద్యోగుల కష్టాలు మరోలా ఉన్నాయి. స్వీపింగ్, శానిటరీ జవాన్ వంటి ఫీల్డు లెవెల్ పనులు చేసే పర్మినెంట్ ఉద్యోగులకు అవసరమైన లావెరీ (సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు) వంటివి సమయానుకూలంగా అందించాల్సిన బాధ్యత కూడా జీహెచ్ఎంసీ పైనే ఉంది. కానీ వీరికి సకాలంలో లావెరీ ఐటమ్స్ అందడం లేదని ఇప్పటి వరకు పలు సార్లు యూనియన్లు నేరుగా కమిషనర్‌కు వినతి పత్రాలు సమర్పించిన యాక్షన్ లేదు. కానీ ఇన్‌టైమ్‌లో లావెరీ ఐటమ్స్ ఇస్తున్నట్లు సర్కిళ్లలో బిల్లులు డ్రా అవుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. కార్మికులపై నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇదిలా ఉండగా, ఎంటమాలజీ విభాగంలో దోమల నివారణ విధుల్లో భాగంగా ఎంటమాలజీ పీల్డు వర్కర్లను నడుము లోతు వరకు చెరువులు, కుంటలతో పాటు మూసీలోకి దింపి, దోమల వ్యాప్తికి కారణమైన గుర్రపు డెక్కను తొలగించే పనులు చేయిస్తున్నారు. వీరికి కనీసం బూట్లు, స్పెషల్ డ్రెస్ వంటివెమీ పంపిణీ చేయడం లేదు. చాలా మంది కార్మికులు విష పురుగులు, పాముల కాటు గురై మృతి చెందగా, మరి కొందరు గుర్తు తెలియని వ్యాధుల బారిన పడి కూడా మృతి చెందిన ఘటనలున్నాయి. ఇలా వరుసగా కార్మికుల ప్రమాదాల బారిన పడి చనిపోతున్నా, అధికారులు వారి సేఫ్టీని పట్టించుకోకపోవడం గమనార్హం.

Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా? లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?