GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని దేశంలోనే అతి పెద్ద నగరంగా తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థలను కలుపుకుని, మొత్తం 300 నుంచి 306 వరకు వార్డులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోగా, నేడో లేదా రేపో వార్డుల డీలిమిటేషన్ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ జనాభా కోటి 2 లక్షల వరకు ఉండగా, విలీన స్థానిక సంస్థలను కలుపుకుని ప్రస్తుత అంచనా జనాభా సుమారు కోటి 30 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు సమాచారం సేకరించారు. ఈ మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకుని, ప్రతి 40 వేల జనాభాతో, పది శాతం ఎక్కువ లేదా తక్కువ (అంటే 36 వేల నుంచి 44 వేల మధ్య) ప్రాతిపదికన మున్సిపల్ వార్డులను పునర్విభజించినట్లు తెలిసింది.
పాత పరిధిలో పెరుగుదల
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల సంఖ్య సుమారు 260 నుంచి 270 వరకు పెరగనున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడే డివిజన్లకు ఆయా ప్రాంతాల్లోని చారిత్రక ప్రాంతాలు, పేరుగాంచిన ల్యాండ్‌మార్క్‌లతో పేర్లను అధికారులు ఫిక్స్ చేస్తున్నారు. పాత 150 డివిజన్లను పునర్విభజించగా, విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థలను మరో 40 నుంచి 50 వరకు పునర్విభజించి మొత్తం వార్డుల సంఖ్యను 300 నుంచి 306కు పరిమితం చేయాలని భావిస్తున్నారు. విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లోని కార్పొరేషన్లను రెండు వార్డులుగా (మొత్తం 14 వార్డులుగా), అలాగే 20 మున్సిపాలిటీలను దాదాపు ఒక్కో వార్డుగా ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పెద్ద అంబర్‌పేటలో అదనంగా రెండు వార్డులను కొత్తగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Also Read: TG Global Summit: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌లో కీలక మార్పులు
నోటిఫికేషన్ తర్వాత వేగవంతం
డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే, జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేవలం వారం రోజుల్లోనే అభ్యంతరాల స్వీకరణ, డిస్పోజ్ చేసి, ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే దిశగా జీహెచ్ఎంసీ వ్యూహాం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు, ముషీరాబాద్ సర్కిల్‌లో కొత్తగా 3 వార్డులు, కాప్రా సర్కిల్‌లో 6, అంబర్‌పేట సర్కిల్‌లో 5, మెహిదీపట్నం సర్కిల్‌లో 5, శేరిలింగంపల్లి సర్కిల్‌లో 4, జూబ్లీహిల్స్ సర్కిల్‌లో 4, కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 4, ఉప్పల్‌లో 4, హయత్ నగర్ సర్కిల్‌లో 1 చొప్పున మొత్తం 10 సర్కిళ్లలో కలిపి 38 కొత్త వార్డులు ఏర్పాటు కాగా, పాత 47 వార్డులతో కలిపి ఈ 10 సర్కిళ్లలో వార్డుల సంఖ్య 85కు పెరగనుంది. మొత్తం 30 సర్కిళ్లలో దాదాపు ప్రతి సర్కిల్‌లో నాలుగు వార్డులు పెరగనున్నట్లు అంచనా.
Also Read: Gummadi Narsaiah Biopic: ప్రారంభమైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్.. మంత్రి ఏం అన్నారంటే?

