GHMC Property Tax: ఆర్థిక సంక్షోభంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాను నింపేందుకు కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభంలోనే ఏప్రిల్ నెలలో ‘ఎర్లీబర్డ్’ స్కీమ్ కింద ముందస్తు పన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
లక్కీ డ్రా ద్వారా రూ. లక్ష బహుమతి
ఏప్రిల్ నెలలో ఒకేసారి ఏడాది పన్ను చెల్లించే వారికి ఇచ్చే 5 శాతం రాయితీతో పాటు, ఈసారి లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు రూ. లక్ష నగదు బహుమతి అందించాలని కమిషనర్ భావిస్తున్నారు. ఈ బహుమతి మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ నిధుల నుండి కాకుండా, ఎస్‌బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా అందించేలా చర్చలు జరుపుతున్నారు. గతంలో 2017లో అమలైన ఇలాంటి పథకం మంచి ఫలితాలను ఇవ్వడంతో, ఇప్పుడు భారీ నజరానాతో పన్ను వసూళ్లను పెంచాలని అధికారులు యోచిస్తున్నారు.
Also Read: GHMC Property tax: దారి మళ్లుతున్న బల్దియా నిధులు.. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల చేతివాటం!
ఓటీఎస్ బకాయిలపై కూడా నిఘా
సుమారు రూ. 10 వేల కోట్ల మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌పై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇందులో 90 శాతం వడ్డీ మాఫీ పొందుతున్న వారికి కూడా డ్రా నిర్వహించాలా వద్దా అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. ఏప్రిల్ నెలలో పన్ను చెల్లింపుదారులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా నిధులు సమకూర్చుకోవాలని జీహెచ్‌ఎంసీ (GHMC) లక్ష్యంగా పెట్టుకుంది.
పండుగ తర్వాత వసూళ్ల వేట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) టార్గెట్ రూ. 3 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 1500 కోట్లు మాత్రమే వసూలైంది. మిగిలిన రూ. 1500 కోట్లను వచ్చే రెండున్నర నెలల్లోనే రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే, వచ్చే సోమవారం నుండి బిల్ కలెక్టర్లు, ఇన్స్‌పెక్టర్లకు రోజువారీ టార్గెట్లు ఇచ్చి రంగంలోకి దింపాలని కమిషనర్ నిర్ణయించారు.
Also Read: GHMC Property Tax: జీహెచ్ఎంసీకి పండగే పండుగ.. తెగ వచ్చేస్తున్న ఆదాయం

